
అభివృద్ధి పనులు మరింత పారదర్శకం
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ .. అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పనుల జాతర – 2025 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ.15.61 కోట్లతో 2,802 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. ఆగస్టు 22న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తయిన పనులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టిన పనుల భూమి పూజ చేసి మొదలుపెట్టించాలని ఆదేశించారు. వనమహోత్సవం నిర్వహించి పండ్లు, నీడ నిచ్చే మొక్కలను నాటించాలన్నారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు.