
సైబర్ నేరస్తుడికి ఏడాది జైలు, జరిమానా
వరంగల్ క్రైం : ఓ సైబర్ నేరస్తుడికి హనుమకొండ జిల్లా మూడో అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి.. ఏడా ది 29 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించినట్లు వరంగల్ సైబర్ క్రైం డీఎస్పీ కలకోట గిరికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జార్ఖండ్‌లోని జంఠారా జిల్లాకు చెందిన బిదూర్ మహాతో తరచూ ఆన్‌లైన్, చాటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. మహా తోపై కమిషనరేట్ పరిధిలోని కేయూ పీఎస్‌లో 2, సుబేదారి పీఎస్‌లో 2, మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇటీవల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు అధికారినంటూ నగరానికి చెందిన జూపాక అర్చనకు ఫోన్ చేసి రూ.63,837 బదిలీ చేయించుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మే రకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, విచారణ అధికారి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి.. నేరం రుజువుకావడంతో నేరస్తుడు బిదూర్ మహాతోకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడడంతో పాటు మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.