
సీనియర్ సిటిజన్లు మార్గ నిర్దేశకులు
వరంగల్ లీగల్: ప్రస్తుత సమాజానికి సీనియర్ సిటిజన్లు మార్గదర్శకులని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వీబీ నిర్మలా గీతాంబ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కోర్టులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రులను దైవసమానులుగా భావించినప్పుడే జీవితానికి అర్థమన్నారు. చట్టపరమైన వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. కుటుంబాల్లోని వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, సీనియర్ న్యాయవాది తీగల జీవన్‌గౌడ్, న్యాయవాదులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ న్యాయమూర్తి
వీబీ నిర్మలా గీతాంబ