
మూడు దశాబ్దాల న్యాయపోరాటం ఫలించింది
హన్మకొండ చౌరస్తా: క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణ కోసం మూడు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటం ఫలించిందని హనుమకొండ సెంటనరీ బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ తాళ్లపెల్లి విజయ్‌స్వరూప్ అన్నారు. హనుమకొండలోని మిషన్ ఆస్పత్రి ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల కోట్ల విలువైన మిషనరీ ఆస్తులను కొందరు అక్రమంగా అమ్ముకున్నారని, ఆస్తుల పరిరక్షణ కోసం ముప్పై ఏళ్ల క్రితం డి. జయరాజ్ మరో నలుగురితో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. మూడు దశాబ్దాల పోరాటం తర్వాత మద్రాస్ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందన్నారు. 2,000 సంవత్సరం తర్వాత అక్రమంగా అమ్మిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో అమ్మేందుకు ఎవరికి హక్కు లేదంటూ తీర్పు వెలువరించిందన్నారు. కాగా, మిషనరీ ఆస్తుల పరిరక్షణకు జరిగిన న్యాయపోరాటంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సాయం మరవలేనిదని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాది రాంగోపాల్‌రావు, నెల్లూరుకు చెందిన క్రైస్తవులు అనిల్‌కుమార్, సునీల్‌కుమార్, సీబీసీ సెక్రటరీ క్రిష్టోఫర్‌రూబెన్, జాయింట్ సెక్రటరీ విద్యాకర్, ట్రెజరర్ విల్సన్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
సీబీసీ ప్రెసిడెంట్ విజయ్‌స్వరూప్