
వేతన బకాయిలు చెల్లించాలి
హన్మకొండ: కాకతీయ మెడికల్ కాలేజీలోని మెన్స్, ఉమెన్‌న్స్ హాస్టల్‌లో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న 86 మంది కార్మికుల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య అన్నారు. 8 నెలల వేతనాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు, తిరిగి ఏకశిల పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్కు దీక్ష శిబిరం వద్ద సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ ఎనిమిది నెలల బకాయి వేతనాలను కార్మికులకు వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా యంత్రాంగం చొరవ చూపి సమ్మె విరమణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుంటే, కార్మికులు వేతనాల కోసం రోడ్లెక్కితే జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, యూనియన్ నాయకులు అల్లం రమేశ్, రాణి, రాజకుమారి, ఎండీ అతిక్, రాము, మంద కవిత, రవి, బాబు, శశి, సుమన్, వంశీ, ప్రశాంత్, సునీత పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
కేఎంసీ కార్మికుల ర్యాలీ