
గణేశ్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి
● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: గణేశ్ నవరాత్రోత్సవాల్లో నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు సూచించిన నిబంధనలు పాటించి వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలిచ్చారు. గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ ప్రొటోకాల్ వెబ్ సైట్ https:// policeportal.tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.
నింబధనలు ఇవీ..
● గణేశ్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో, స్థల యజమానితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
● విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి.
● మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి.
● వృద్ధులు, చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్ధ కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.
● గణేశ్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత ఉన్న షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. గణేశ్ మండపంలో 24 గంటలు ఒక వలంటీర్ ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
● మంటలు ఆర్పేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మండపానికి సమీపంలో రెండు బకెట్ల నీళ్లు, ఇసుక ఏర్పాటు చేసుకోవాలి.
● మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాడడం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాల ప్రదర్శన, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం పూర్తిగా నిషేధం.
● విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు.