
మెట్రోనగరాల సరసన వరంగల్
● స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ సుధారాణి
రామన్నపేట : రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాలవాంచ అయిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను రూ.4,100 కోట్లతో చేపట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇందులో భాగంగానే రూ.158 కోట్లతో వరద ముంపు నివారణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాస్కీ సంస్కరణల ద్వారా నగర అభివృద్ధికి రూ.200 నుంచి రూ.250 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిధులు ద్వారా నగరంలో నీటి సరఫరా మెరుగు కావడంతో పాటు ఇంటినంబర్ల హేతుబద్ధీకరణ, స్పాంజ్ పార్కులు, తాగునీటి బావుల పునరుద్ధరణ, భూగర్భజలాల బలోపేతం, బస్తీలో చిట్టి పార్క్‌లు, తదితర అభివృద్ది పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సాస్కి ప్రాజెక్టులో గ్రేటర్ వరంగల్ చేరడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్ మసూద్, కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి, గుండు చందనపూర్ణచందర్, సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.