
కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
● వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : త్వరలోనే కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు, మ రింత బలమైన సమగ్ర, సృజనాత్మకంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేద్దామని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేయూ పరిపాలన భవనం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేయూ స్వర్ణత్సవాల్లో భాగంగా ఈనెల 19, 20, 21వ తేదీల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేయూ 23వ స్నాతకోత్సవాన్ని, టీజీఎడ్‌సెట్–2025ను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. రూసా ద్వారా ఐదు పరిశోధన కేంద్రాలు, 37 ప్రాజెక్టులకు రూ.37 కోట్ల నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వచ్చేనెలలో రూసా ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, టీహబ్ సహకారంతో కేహాబ్‌లో స్టార్టప్‌లు నిర్వహించబోతున్నామన్నారు. జువాలజీ విభాగానికి రెండు పేటెంట్లు లభించాయన్నారు. వచ్చేనెలలో యూని వర్సిటీలోని అధ్యాపకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్)ను ప్రవేశపెట్టబోతున్నట్లు వీసీ వెల్లడించారు. ఇటీవల బోధన, బోధనేతర, విశ్రాంత ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, డాక్టర్ బి.రమ, సుదర్శన్, సుకుమారి, చిర్ర రాజు, ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.