
రజితకు కన్నీటి వీడ్కోలు..
● నివాళులర్పించిన రచయితలు,
వివిధ సంఘాల ప్రతినిధులు
● మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, రిజిస్ట్రార్ రామచంద్రం
● కేఎంసీకి రజిత భౌతికకాయం దానం
కేయూ క్యాంపస్ : ప్రముఖ కవి, రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రీల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలోనివాసం ఉండే అనిశెట్టి రజిత (67)సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం విధితమే. రజిత కేయూలో నాన్‌టీచింగ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఉద్యోగవిరమణ పొందారు. ఆమె అ వివాహిత. కొంతకాలంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. గుండెపోటు వచ్చి అపస్మారకస్థితికి చేరడంతో రచయిత శోభారమేశ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి యజమాని నిరాకరించడంతో కేయూ తెలుగు విభాగం రిటైర్డ్ ఆచార్యులు కాత్యాయనివిద్మహే ఇంటి వద్దకు రజిత భౌతికకాయాన్ని తరలించారు. ఇక్కడ రచయితలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు.. రజితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజిత ప్రజాస్వామిక రచయిత్రీల జాతీయ వేదిక అధ్యక్షురాలిగా అందించిన సేవలు, ఆమెతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ మలిదశ
ఉద్యమంలో క్రియాశీలక పాత్ర..
ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత మృతి బాధాకరమని, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రజిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలువలతోకూడిన జీవితానికి ఆమె నిదర్శనమన్నారు. సీ్త్ర సామాజిక సమానత్వం కోసం తన రచనల ద్వారా చైతన్యం నింపారన్నారు.అనిశెట్టి రజిత తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపర్చారని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. అనిశెట్టి రజిత మృతి ప్రజాస్వామిక రచయిత్రీల వేదికకు తీరని లోటని ఆ వేదిక జాతీయ కార్యదర్శి ఎల్లూరి మానస అన్నారు. రచయిత్రీగా రజిత తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడించేవారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డల లక్ష్మణ్ అన్నారు.
ఘన నివాళి..
అనిశెట్టి రజిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కేంద్రసాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్యనవీన్, రచయితలు బన్నఅయిలయ్య, వీఆర్ విద్యార్థి, టి చందు, తాయమ్మరణ, శోభారమేశ్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ప్రజాఫ్రంట్ నేత బి.రమాదేవి, మహిళా సంఘం నేత సదాలక్ష్మి, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ ప్రొఫెసర్లు జ్యోతిరాణి, వి.శోభ,గిరిజారాణి, విజయలక్ష్మి, కిష్టయ్య, విరసం నేత కుమారస్వామి, ప్రముఖ అనువాద రచయిత నలిమెల భాస్కర్, బంధుమిత్రుల కమిటీ బాధ్యురాలు భారతక్క, తదితరులు ఉన్నారు.
వివిధ సంఘాల బాధ్యుల సంతాపం
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత మృతి చాలా బాధకరమని, సమాజంలో మహిళల పరిస్థితిపై మహిళల హక్కులపై తన రచనలతో చైతన్యం కలిగించారని మానవ హక్కుల వేదిక బాధ్యుడు జీవన్‌కుమార్ తన ప్రగాడ సంతాపం తెలిపారు. అదేవిధంగా సహృదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరబాబు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్‌వీఎన్‌చారి, సాహిత్య కార్యదర్శి మల్యాల మనోహర్‌రావు, వనం లక్ష్మీకాంతారావు, లక్ష్మణరావు, కాళోజి ఫౌండేషన్ బాధ్యుడు డాక్టర్ ఆగపాటిరాజ్‌కమార్ సంతాపం తెలిపారు.
కేఎంసీకి రజిత భౌతికకాయం దానం
సంతాపసభ అనంతరం రచయితలు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు అంబులెన్స్‌లో రజిత భౌతికకాయంతో కేయూ మొదటి గేట్ క్రాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజితకు జోహార్లు అర్పించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని వరంగల్ కేఎంసీకి తరలించి దానం చేశారు. అంతకు ముందు నేత్ర వైద్యులు రజిత నేత్రాలు సేకరించారు.

రజితకు కన్నీటి వీడ్కోలు..

రజితకు కన్నీటి వీడ్కోలు..