
హంటర్ రోడ్డులో నీట మునిగిన సంతోషిమాత కాలనీ ప్రాంతం
వరంగల్ నగరంలో కుంభవృష్టి
జలదిగ్బంధంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
పలుకాలనీల ఇళ్లలోకి చేరిన వరదనీరు
అండర్ బ్రిడ్జి నుంచి నిలిచిన రాకపోకలు
బాధితులకు ఆహారం అందించిన దాతలు
ఖిలా వరంగల్: భారీ వర్షానికి వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కురిసిన కుంభవృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ అండర్ బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. విలీన గ్రామాల్లో చెరువుల మత్తడితోనే ఈ దుస్థితి వచ్చిందని చెబుతున్నారు.
ప్రధానంగా దూపకుంట, గాడిపల్లి, గుంటూరుపల్లి నుంచి పెద్ద ఎత్తున వరదనీరు తూర్పుకోటకు చేరుతోంది. దీంతో అగర్త చెరువులు నిండి వరదనీరు మైసయ్యనగర్, శివనగర్, పెరికవాడ అంతర్గత కాలనీల్లో ప్రవహిస్తోంది. మట్టికోట అగర్త చెరువు మత్తడి నీరు మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పక్క నుంచి జాతీయ రహదారి మీదుగా నాగేంద్రనగర్, కాశికుంట, విద్యానగర్, లక్ష్మీనగర్, సాకరాశికుంట, శాంతినగర్, ఎస్ ఆర్‌ఆర్‌తోట మీదుగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు స్వచ్ఛంద సంస్థలు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశాయి.
నీటిలో కాకతీయుల రాజధాని..
చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. మధ్యకోటలో పంటపొలాలు, ఆకుకూర తోటలు నీటిలో మునిగిపోయాయి. సుమారు రూ.5 లక్షల మేరకు పంట నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.
వాంబేకాలనీలో వృద్ధురాలి మృతి
వరంగల్ 41వ డివిజన్ కాశికుంట వాంబే కాలనీకి చెందిన వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన ఆమె పడుకున్న మంచం నీటిలో మునిగింది. కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వృద్ధురాలు అప్పటికే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసుల సహాయక చర్యలు..
మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు, గిరిప్రసాద్‌నగర్‌లో నీట మునిగిన ఓ ఇంటిలోని కుటుంబాన్ని క్షేమంగా ఇన్‌స్పెక్టర్ కాపాడి బయటకు తీసుకొచ్చారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
రామన్నపేట: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ప్రజలకు సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని సాయిగణేశ్ కాలనీ, గాంధీనగర్, డీకే నగర్, లెనిన్‌నగర్, అగర్తల చెరువు, మైసయ్యనగర్, గిరిప్రసాద్‌కాలనీ, పద్మనగర్, సాకరాశికుంటలో వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రెయిన్లు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, ఆహారం, మందులు అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం పిల్లలను పాఠశాలకు పంపించొద్దని, పిల్లలు చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని వెల్లడించారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ బాధితులకు నగరంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, కార్పొరేటర్ భోగి సువర్ణ సురేశ్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శ్రీధర్‌రెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్ ఉన్నారు.
నేడు, రేపు స్కూళ్లకు సెలవులు
విద్యారణ్యపురి: భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబా బాద్ జిల్లాల్లో బుధ, గురువారాలు (రెండు రోజులు) పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు ఉత్తర్వులు అందాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిగా సెలవులు పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లాలో 34.1 మిల్లీవీుటర్లు..
హనుమకొండ: జిల్లాలో మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 34.1 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండలో 11.37 సెంటీమీటర్లు, ఐనవోలులో 85.4 మిల్లీవీుటర్లు, కాజీపేటలో 81.6 మిల్లీవీుటర్లు, భీమదేవరపల్లిలో 12.1 మిల్లీవీుటర్లు, వేలేరులో 21.6, ఎల్కతుర్తిలో 15.1, కమలాపూర్‌లో 13.6, హసన్‌పర్తిలో 31.5, ధర్మసాగర్‌లో 29, కాజీపేటలో 81.6, హనుమకొండలో 113.7, ఐనవోలులో 85.4, పరకాలలో 6.6, దామెరలో 36.4, ఆత్మకూరులో 8, శాయంపేటలో 11.7, నడికూడలో 10.9 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లాలో 97.2 మిల్లీవీుటర్లు
వరంగల్ జిల్లాలో సగటున 97.2 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. సంగెంలో 202.7 మిల్లీవీుటర్లు, ఖిలా వరంగల్‌లో 148.5, వర్ధన్నపేటలో 122.3, పర్వతగిరిలో 107.5, వరంగల్‌లో 94.9, గీసుకొండలో 91.3, నెక్కొండలో 88.2, చెన్నారావుపేటలో 86, రాయపర్తిలో 82.8, ఖానాపురంలో 70.3, దుగ్గొండిలో 63, నల్లబెల్లిలో 55.2, నర్సంపేటలో 51.5 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది.
అధికారులు అందుబాటులో ఉండాలి: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలో ని అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు స్థానికంగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వండి : సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, శిథిలావస్థ భవనాల్లోని నివాసితులు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షంలో వాహనాలపై వెళ్లే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కంట్రోల్ రూంల ఏర్పాటు
టోల్ ఫ్రీ నంబర్ : 1800 4251980
వరంగల్ కలెక్టరేట్ : 97019 99676
హనుమకొండ కలెక్టరేట్ : 79819 75495
అత్యవసరమైతే సాయం కోసం ఈ నంబర్లలో సంప్రదించాలి

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ సత్యశారద, పక్కన గ్రేటర్ కమిషనర్