హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈనెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఉగాది రోజున రుద్రేశ్వరస్వామికి పాశుపత రుద్రాభిషేకం జరుగుతుందని, సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సుదర్శనహోమంలో పాల్గొనే భక్తులు రూ. 2,116, ఏప్రిల్ 6న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతీ రోజు శ్రీరాములకు ప్రత్యేకపూజలు, సుదర్శనహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఋగ్వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, శ్రవణ్, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు.