
‘హైపర్’తో సత్వర సేవలు
హన్మకొండ: హైపర్‌తో సత్వర సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ ఎస్‌ఈలు పి.మధుసూదన్‌రావు, కె.గౌతం రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినపుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ‘హైపర్‘ అనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
హైపర్ అంటే..
‘హెచ్’ అంటే హెడ్ క్వార్టర్‌లో అప్రమత్తంగా ఉండడం, ‘ఎ’అంటే సిబ్బంది, సామగ్రి సమీకరణ, ‘ఐ’ అంటే సమాచార సేకరణ, చేరవేయడం, ‘పీ’ అంటే పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం, ‘ఇ’ అంటే నిర్ధిష్ట కార్యాచరణ అమలు, ‘ఆర్’ అంటే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం అని ఎస్‌ఈలు వివరించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
డిష్యుం డిష్యుం
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కమీషన్ విషయంలో శుక్రవారం రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నగరంలోని ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం భూక్రయవిక్రయదారులతోపాటు రియల్టర్లు కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ సాయంత్రం ఆరు గంటలకు పూర్తి కాగా కార్యాలయ ఆవరణలోనే భూమి అమ్మకంలో పాత్ర పోషించిన తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలని రియల్టర్లు గొడవకు దిగారు. గొడవ కాస్త ఘర్షణకు దారి తీసి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చొక్కాలు చింపుకునే స్థాయికి చేరుకోవడంతోపాటు కార్యాలయ ఆవరణలో కుర్చీలను విసిరేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల వారు డయల్ 100కు ఫోన్ చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి పలాయనం చిత్తగించారు.
శాంతిని కోరుతూ
కవి సమ్మేళనం
హన్మకొండ కల్చరల్ : ప్రపంచ కవితాదినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన బహుభాషా కవి సమ్మేళనం అలరించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కవులు పాల్గొని ‘కవులు ప్రపంచానికి ఏమవుతారు ?’ అనే ఆంశంపై తమ కవితలు వినిపించారు. అనంతరం హనుమకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కూజ విజయ్‌కుమార్ ఉత్తమ కవితలు వినిపించిన కవులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మిగిలిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాకుడు సిరాజుద్దీన్, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆచార్య బి.సురేష్, సంస్థ ప్రధాన కార్యదర్శి సుదాకర్‌రావు, కోశాధికారి విష్ణువర్ధన్, సంస్థ బాధ్యులు పాల్గొన్నారు.
‘కుడా’కు భూమి అప్పగింత
నయీంనగర్: కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని పైడిపల్లి రైతులు వారి గ్రామానికి చెందిన 10 ఎకరాల వ్యవసాయ పట్టా భూమిని అభివృద్ధి కోసం ‘కుడా’కు అప్పగించారు. ఈ మేరకు కుడా కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని కలిసి భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామం ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ‘కుడా’కు భూమి ఇచ్చినట్లు తెలిపారు.

‘హైపర్’తో సత్వర సేవలు