కీచక అధ్యాపకుడు..!
పరకాల: డిగ్రీ కాలేజీలో విద్యార్థినులపై ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న మోరె అశోక్ చాలాకాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్‌కుమార్‌కు విద్యార్థినులు ఫిర్యాదు చేయగా అతన్ని మందలించి వదిలేశారు. అయినప్పటికీ ఆ కీచక అధ్యాపకుడు ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ విద్యార్థినులకు వీడియోకాల్స్ చేయడం, ఫోన్‌లో చాటింగ్ చేయడంతో పాటు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ కీచకుడి వేధింపులపై బాధిత విద్యార్థినులు ఈ నెల 18న ప్రిన్సిపల్‌కు మరోసారి ఫిర్యాదు చేయగానే ఆయన లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి విచారణకు ఆదేశించారు. అప్పటికి సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు అశోక్ ఈ నెల 22లోపు ఆ కమిటీకి సంజాయిషీ ఇవ్వాల్సి ఉండగా హాజరు కాలేదు.
బాధిత విద్యార్థినులు, కుటుంబ సభ్యుల ఆందోళన
సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు మోరె అశోక్ మంగళవారం కళాశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని ఆందోళన నిర్వహించారు. అతనిపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని పారిపోయాడు. ఇలాంటి విషయాలపై తాను క్షమించే ప్రసక్తే లేదంటూ ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ వారికి నచ్చజెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపల్ బి.సంతోష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల లైంగిక వేఽధింపులకు పాల్పడిన అధ్యాపకుడు మోరె అశోక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి సంజాయిషి ఇవ్వాలని కోరామని, అయినా పట్టించుకోకపోవడంతో ఉన్నత విద్యాశాఖ బోర్డు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు సదరు అధ్యాపకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
సౌత్ జోన్ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : చైన్నెలోని సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఈనెల 24 నుంచి 28 వరకు జరుగబోతుందని, ఈ టోర్నమెంటులో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో కె.యశ్వంత్, కె. సుధాకర్, విగ్నేష్, ఆర్. నరేందర్ జి. దినేష్‌కుమార్, టి.మయూర్‌రాజ్, ఎస్. తారాకేష్ యాదవ్, ఎం.శ్రీహరి, బి. ఈశ్వర్ కె భరత్‌రాజ్, సిహెచ్‌జయ చంద్ర, పి.అవినాష్ ఉన్నారని తెలిపారు. జట్టుకు హనుమకొండ గీతాంజలి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఇర్ఫాన్ మహ్మద్ కోచ్‌గాను, యూనివర్సిటీ పీజీ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.భాస్కర్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మెన్స్ హాకీ టీమ్ ఎంపికలు
కేయూ మైదానంలో మంగళవారం ఇంటర్ కాలేజీయేట్ యూనివర్సిటీ హాకీ మెన్స్ టీమ్ ఎంపికలు నిర్వహించినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. ఈ ఎంపికలకు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 40 మంది హాకీ క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు చెన్నయ్ సత్యభామ యూని వర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్టర్స్ కె.సునీల్‌రెడ్డి, కె.శ్రీనివాస్, ఎస్డీ యాసిన్, కె.రాకేష్ పాల్గొన్నారు.
● పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి లైంగిక వేధింపులు
కీచక అధ్యాపకుడు..!


