బైక్‌ను ఢీకొన్న ఇసుక లారీ..
● యువకుడి దుర్మరణం ● దేవన్నపేటలో విషాదం
హసన్‌పర్తి: ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి–ఉనికిచర్ల మార్గమధ్యలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ పంజాల నాగలక్ష్మి కుమారుడు చరితకుమార్(27) స్థానికంగా వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేడోడువాడుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం జాతీయ రహదారి మీదుగా బైక్‌పై నిరూప్‌నగర్ తండా వైపునకు బయలుదేరాడు. సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగా, వడ్డేపల్లి నుంచి ఉనికిచర్ల వైపునకు వెళ్తున్న ఇసుక లారీ డివైడర్ల పైనుంచి దూసుకొచ్చి బైక్‌ను ఢీకొంటూ రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ప్రమాదంలో చరితకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, భూపాల్‌తోపాటు బంధువులు ఘటనా స్థలికి తరలొచ్చి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చరితకుమార్ మృతితో దేవన్నపేటలో విషా దం అలుముకుంది. కాగా, సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘటనాస్థలిని సందర్శించి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు.
ఐపీఎల్ సెలక్టర్‌గా సాయినాథ్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన సంకేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కీర్తన దంపతుల కుమారుడు సాయినాథ్‌రెడ్డి ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సూపర్ సెలక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల ఐపీఎల్ టెక్నికల్ వింగ్‌కు దేశ వ్యాప్తంగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో సాయినాథ్ రెడ్డి సెలక్టర్‌గా ఎంపికయ్యారు. దీంతో యూ ఏఈలోని అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోచ్ సంగక్కర, డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్‌తోపాటు సాయినాథ్‌రెడ్డి.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కాగా, సాయినాథ్‌రెడ్డి బెంగళూరులో డేటా సైంటిస్ట్ ఉద్యోగం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
బీసీ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ
హన్మకొండ: ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) ఆధ్వర్యంలో బీసీ మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్‌లోని ఓబీసీ కార్యాలయంలో ఫ్రీ ఉమెన్ ట్రైనింగ్ ఫర్ బీసీ ఉమెన్ కార్ పైలట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు బీసీ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
బైక్‌ను ఢీకొన్న ఇసుక లారీ..


