● వరంగల్ తూర్పు నియోజకవర్గంలో
13 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల భేటీ
● కాంగ్రెస్‌లో చేరేందుకు
ముఖ్యనేతనుంచి గ్రీన్‌సిగ్నల్?
వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు 13 మంది కార్పొరేటర్లు మరోసారి రహస్య ప్రదేశంలో మంగళవారం సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు నాయకత్వం లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కార్పొరేటర్ ఇటీవల రాజకీయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆపార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా ఆయనకు అండగా నిలవలేదు. తమకు కూడా ఇబ్బందులు ఎదురైతే దిక్కెవరు అని మిగిలిన కార్పొరేటర్లు సైతం మిన్నకుండినట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నట్లు తెలిసింది. ఈక్రమంలో బీఆర్‌ఎస్‌లో ఉండాలా.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశమైనట్లు సమాచారం. ఇటీవల ఓ కార్పొరేటర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు, మరో కార్పొరేటర్‌పై ఆర్థికపరమైన కేసు నమోదైనా కూడా ముఖ్య నాయకుడు పట్టించుకోకపోవడంతో అభద్రతాభావానికి గురైనట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమై చివరి నిమిషంలో బీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయిన నాయకుడి నేతృత్వంలో ఈ సమావేశం జరిగినట్లు చర్చ జరుగుతోంది.