
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో గతేడాది నియమించిన అడ్జెంట్ ఫ్యాకల్టీ 16మందికి నోటీస్‌లు జారీచేయాలని పిటిషనర్ న్యాయవాదికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 16మందిని అడ్జెంట్ ఫ్యాకల్టీగా నియమించారు. ఇది యూజీసీ, యూనివర్సిటీ చట్టంలోని నియమ నిబంధనలకు వ్యతిరేకమని ఓ ప్రైవేట్ వ్యక్తి 2023 జూన్‌లో హైకోర్టులో కేసు(పిటిషన్)వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 15న వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కేయూ వీసీకి, అలాగే 16మంది అడ్జెంట్ ఫ్యాకల్టీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సంబంధిత పిటిషనర్ తరఫు న్యాయవాది ఆ.. 16మంది అడ్జెంట్ ఫ్యాకల్టీకి నోటీసులు పంపారని సమాచారం. కాగా, అడ్జెంట్ ఫ్యాకల్టీలో ఏడుగురిని గత ఏడాది డిసెంబర్ లో విధులనుంచి రిలీవ్ చేశారు. మిగతా ఏడుగురి నియమితకాలం గత జనవరి 31వ తేదీతో ముగిసింది. మరో ఇద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరిద్దరికి మే 12వ తేదీవరకు నియమితకాల సమయం ఉంది.