
ఎల్కతుర్తి : వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆధారం లేకుండా తరలిస్తున్న రూ. 19.67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మానుకోటలో రూ.9. 95 లక్షలు..
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు, ఫ్లయింగ్ స్వ్యాడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బుక్క బజార్ సమీపంలో గురువారం ఓ వ్యక్తి వద్ద రూ.9. 95 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి ఆధారం లేకుండా తరలిస్తున్న ఈ నగదును పట్టుకుని సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు.
కేసముద్రంలో రూ.6 లక్షలు..
కేసముద్రం: మండల కేంద్రంలోని మార్కెట్ సమీపంలో కేసముద్రం విలేజ్‌కి చెందిన వ్యాపారి సట్ల శ్రీను రూ.3 లక్షలు, కేసముద్రంస్టేషన్‌కు చెందిన మరోవ్యాపారి చిదురాల వసంతరావు వద్ద రూ.3లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు ఆధారం చూపకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
ఎల్కతుర్తిలో రూ. 2.32 లక్షలు..
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని బస్టాండ్ క్రాస్ వద్ద గురువారం ఆధారం లేకుండా తరలిస్తున్న రూ.2.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు రాజ్‌కుమార్, సాయిబాబు తెలిపారు. సేల్స్‌మెన్ అజ్మీరా అశోక్ హనుమకొండ నుంచి హుజూరాబాద్ వైపునకు ఆటోలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటోను తనిఖీ చేయగా నగదు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని సీఐ తెలిపారు.
డోర్నకల్‌లో రూ.1.40 లక్షలు..
డోర్నకల్: డోర్నకల్ పట్టణ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రూ.1.40 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారెపల్లి మండలం ఎర్రబోడు మాణిక్యారం గ్రామానికి చెందిన భూక్యా శోభన్ ఆధారం లేకుండా నగదును తరలిస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment