ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో
నరకాసుర ‘వధ’
కరీమాబాద్: వరంగల్ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో శనివారం రాత్రి నరకాసుర వధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నరకాసుర వధ నిర్వహించడం ఆనవాయితీ. ఈక్రమంలో శనివారం రాత్రి 70 అడుగుల నరకాసురుడి ప్రతిమను బాణసంచాతో కాల్చివేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయసహకారాలు అందకపోవడంతో ఉత్సవ కమిటీ సభ్యులు.. దాతలు, ప్రజల సహకారంతో వేడుకలు నిర్వహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే పాటలు, ఆటపాటలతో మిరుమిట్లు గొలిపే దీపాల వెలుగుల్లో వేడుకలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.