నాడు పరిహారం.. నేడు పరిహాసం | - | Sakshi
Sakshi News home page

నాడు పరిహారం.. నేడు పరిహాసం

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

వైఎస్సార్‌ సీపీ హయాంలో జిల్లాలో 9వేలమంది పసుపు రైతులకు అందిన పరిహారం

రైతుకు ఎంతో మద్దతు

గతంలో ఎకరాకు రూ.52,800

చొప్పున పంపిణీ

మద్దతు ధరకు పంట కొనుగోళ్లు

కొల్లిపర మండల రైతులకే అధిక ప్రయోజనం

వైఎస్‌ జగన్‌ పాలన స్వర్ణయుగాన్ని

గుర్తుకు తెచ్చుకుంటున్న ౖరైతులు

నేటి కూటమి ప్రభుత్వంలో మోంథా తుఫాన్‌ పరిహారానికే దిక్కులేదంటూ పెదవి విరుపు

వైఎస్సార్‌ సీపీ హయాంలో జిల్లాలో 9వేలమంది పసుపు రైతులకు అందిన పరిహారం

తెనాలి: భారతీయులు శుభప్రదంగా భావించే పసుపు పంట సాగులో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతాంగానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. గుంటూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బీమా పరిహారాన్ని నష్టపోయిన పంట నష్టపోయిన పసుపు రైతులకు అందజేసింది. మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసి, నష్టాలపాలు కాకుండా ఆదుకుంది. జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల వేళ, రైతాంగం ఈ అంశాన్ని గుర్తుచేసుకుంటోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు పంటను 13 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసేవారు. ఏటా 35 వేల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఏటికేడాది ఖర్చులు పెరుగుతూ వస్తున్నాయి. ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు రైతులు, పంట చేతికొచ్చేసరికి మార్కెట్‌ మాయాజాలం పసుపు నిరాశపరుస్తోంది. ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ఉన్న పసుపు పంటకు ధరలు ఎప్పుడెలా ఉంటాయో? తెలీని పరిస్థితి. మరోవైపు ఎగుమతులు తగ్గిపోతున్నాయి. అధికవర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు దెబ్బతిన్న పసుపు పంటకు నష్టపరిహారం సంగతి దేవుడెరుగు! అన్నట్టుగా ఉండేది. ఇన్ని సమస్యల మధ్య పసుపు సాగు రైతులకు కత్తిమీద సాములా తయారైంది.

ఎకరాకు రూ.52,800 చొప్పున బీమా

2020–21 ఖరీఫ్‌ సీజనులో అధిక వర్షాలకు జిల్లాలో పసుపు పైరు దెబ్బతింది. ఫలితంగా దిగుబడులు తగ్గాయి. ఎప్పటిలాగే పరిహారం రాదనుకుని తీవ్ర నిరాశలో ఉన్న పసుపు రైతులకు నాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని దాదాపు 9వేల మంది పసుపు రైతులకు ఎకరాకు రూ.52,800 చొప్పున బీమా పరిహారం అందజేసింది. దీనితో పసుపు రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రెండుమూడేళ్లకోసారి ప్రకృతి విపత్తులకు పసుపు దెబ్బతినటం సాధారణమే అయినా, బీమా పరిహారం అందటం, అదికూడా ఎకరాకు రూ.52,800 వంతున రావటమనేది అదే తొలిసారి.

పసుపు రైతులకు అండ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుభరోసా కేంద్రాలతో సహా వ్యవసాయ రంగంలోనూ చేపట్టిన సంస్కరణలతో పసుపు రైతులకు ఆవిధంగా ఊహించని ప్రయోజనం దక్కింది. వ్యవసాయ రంగంలో బీమా అవసరాలను రాష్ట్ర ప్రభుత్వమే చూడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్యకలాపాలు ప్రారంభించేలోగా బీమా నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ను వ్యవహరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో 2021 ఖరీఫ్‌ సీజను ఆఖరులో వ్యవసాయ కమిషనరు, అన్ని జిల్లాల వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్లకు లేఖ రాస్తూ, ప్రస్తుత బీమా విధానం? చేయాల్సిన మార్పులుపై సూచనలు, సలహాలు అడిగారు. అప్పటి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా బీమా కమిటీ సమావేశంలో ఉద్యానశాఖ డీడీ సుజాత, ఏడీ రాజకృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ జేడీ విజయభారతి పాల్గొన్నారు. ఈ కమిటీ సూచన ప్రకారం పసుపు పంటను దిగుబడి ఆధారిత బీమా నుంచి వాతావరణ ఆధారిత బీమాకు మార్పు చేశారు. ఫలితంగా ఆ సీజనులో జరిగిన పంట నష్టానికి పసుపు రైతులకు బీమా అందింది.

ప్రస్తుతం పరిహాసమే..!

ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో మోంథా తుఫాన్‌కు నష్టపోయిన పంటలకు ఇప్పటివరకు పరిహారం అందని విషయం తెలిసిందే. మళ్లీ అర్నబ్‌, మురసు తుఫాన్ల బారిన పంటలను ప్రభుత్వం ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటుందో? పరిహారం అందిస్తారో? లేదోనన్నది సందేహాస్పదమే!

పసుపు రైతులు ఎన్నాళ్లగానో కోరుకుంటున్న ఈ మార్పు ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో జరగటం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. ఖరీఫ్‌ సీజనుకు ముందుగా అందిన బీమా పరిహారంతో రైతులు ధీమాగా పసుపు సాగును చేపట్టారు. అప్పులతో పనిలేకుండా నేరుగా పెట్టుబడి ఖర్చులు సమకూరాయన్న సంబరమది. మార్కెట్‌ ధరల మాంద్యం ఫలితంగా రైతుల దగ్గరే నిల్వ ఉండిపోయిన పసుపు పంటను క్వింటాలుకు రూ.6,850 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో క్వింటాలు పసుపు రూ.5 వేలకు మించి ధర పలకలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచిన తర్వాత మార్కెట్‌ ధరల్లో మరో రూ.200, 300 పెరుగుదల కూడా వచ్చింది. నష్టపోయిన పసుపుకు బీమా రావటం, మద్దతుకు పంటను కొనుగోలు చేయటం పసుపు రైతులకు దక్కిన ప్రయోజనం. అంతేకాదు...అప్పట్లో ఉచిత బీమా విధానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తులకు ఏ సీజనులో పంట నష్టపోతే ఆ తర్వాత సీజనుకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇస్తూ నాటి ప్రభుత్వం ఆదుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement