● నేడు యథావిధిగా జెడ్పీటీసీ,
ఎంపీటీసీ పోలింగ్
● జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: మురసు తుఫాన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని... ఎంతో కష్టపడి యంత్రాంగం ప్రాణనష్టం జరగకుండా చూడగలిగిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. కాకుమాను, పెదనందిపాడు, పొన్నూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, చేబ్రోలు మండలాల్లో ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు. సుమారు 100 చెట్లు కూలిపోగా, వాటిలో 76 చెట్లు రహదారులపై పడ్డాయని తెలిపారు. వాటిని తక్షణమే తొలగించి రాకపోకలను పునరుద్ధరించామన్నారు. 17 రహదారులు దెబ్బతినగా, ఇప్పటికే ఐదు రహదారులను పునరుద్ధరించామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తుండటంతో ఇప్పటికే గేట్లు తెరిచామని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. గుంటూరు–అమరావతి రహదారిలో లాం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలను నియంత్రించామని చెప్పారు. నల్లమడవాగు సామర్థ్యం 18 వేల క్యూసెక్కులు కాగా, మంగళవారం 40 వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం వచ్చిందని, బుధవారం నాటికి 45 వేల క్యూసెక్కుల వరకు ఉండవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. 55 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలగగా, ఇప్పటివరకు 20 విద్యుత్ స్తంభాలు కూలినట్లు గుర్తించామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్నబ్, మురసు తుఫాన్‌లు వరుసగా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేందుకు అవసరమైన పంట నష్ట అంచనాల తయారీకి చర్యలు చేపట్టామని తెలిపారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
గురువారం 13 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 200 మంది అభ్యర్థులు ఉండగా, వారిలో ఏడుగురు ఏకగ్రీవమయ్యారని చెప్పారు. మిగిలిన 193 ఎంపీటీసీ స్థానాలతో పాటు 13 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు అనుకున్నట్లుగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో వరద నీరు ఉండటంతో ఆ మూడు మండలాల్లో ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేయాలని భావించామని తెలిపారు. కానీ, వరద తగ్గుముఖం పట్టడంతో గురువారమే ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.


