గుంటూరు ఎడ్యుకేషన్: గురువారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లాలోని 13 మండలాల్లో 13 జెడ్పీటీసీ, 200 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 193 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల ద్వారా సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఈనెల 5వ తేదీన పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు ఈనెల 7వ తేదీన జరగనుంది. గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల ఓట్ల లెక్కింపు తెనాలి వీఎస్సార్ కళాశాలలో జరగనుంది. గుంటూరు జెడ్పీ రోడ్డులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, రిటర్నింగ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షించారు.


