రైతులకు కన్నీరే | - | Sakshi
Sakshi News home page

రైతులకు కన్నీరే

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

రైతులకు కన్నీరే అన్నదాత గుండెల్లో వరుస తుఫాన్‌ల గుబులు ఏడాది గడిచినా అందని పరిహారం.. భారీగా పంట నష్టం నల్లమడ వాగుకు గండ్లు

ప్రభుత్వ భరోసా కోసం ఎదురుచూపులు..

అన్నదాత గుండెల్లో వరుస తుఫాన్‌ల గుబులు

● ‘అర్నబ్‌’తో ఇప్పటికే 23 వేల

ఎకరాల్లో పంట నష్టం

● మురసు దెబ్బకు 95,830

ఎకరాల్లో పంట నాశనం

● మొంథా పరిహారం కోసం

ఏడాదికి పైగా ఎదురుచూపులు

నీటిని మళ్లించేందుకు జేసీబీతో కాలువను సరిచేయిస్తున్న రైతు

కుంచనపల్లిలో నీట మునిగిన ఆకుకూర మడులు

ఉల్లి చేనులో నుంచి నీటిని బయటకు పంపిస్తున్న రైతు

తాడేపల్లిలో విరిగిపడిన అరటి చెట్లు

కొరిటెపాడు (గుంటూరు): వరుస తుఫాన్లు అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలవుతుండటంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఇటీవల సంభవించిన అర్నబ్‌ తుఫాన్‌ గుంటూరు జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ తుఫాను ప్రభావంతో జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తాజాగా మురసు తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు గుంటూరు జిల్లా వ్యవసాయ రంగాన్ని మరోసారి కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని 133 గ్రామాల్లో 47,001 మంది రైతులకు చెందిన 92,655 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 3,175 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. మొత్తం 95,830 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

గత ఏడాది అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాను నష్టం నుంచి కూడా రైతులు ఇంకా కోలుకోలేదు. మొంథా తుఫాను కారణంగా జిల్లాలో 6,062 ఎకరాల్లో పంటలు నష్టపోయిన సుమారు 3,800 మంది రైతులకు ఇప్పటికీ రూ.5.75 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఏడాది గడిచినా పరిహారం అందకపోవడంతో బాధిత రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

తాడేపల్లిరూరల్‌: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మురసు తుఫాన్‌ ప్రభావం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తమ సొంత ఖర్చులతో పంట పొలాల్లోని నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బోదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పూడ్చుకుపోయిన కాలువలను జేసీబీలతో తవ్వించి నీటిని మళ్లించే పనులు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, కుంచనపల్లి, చిర్రావూరు, మెల్లెంపూడి, నూతక్కి తదితర గ్రామాల్లో అరటి పంట సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో రెండు మూడు నెలల్లో పంట చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలులు, వర్షం కారణంగా అరటి చెట్లు నేలకొరిగాయి. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో ఉల్లి సాగు చేసిన రైతులకు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చయింది. అయితే, ఉల్లి చేలు దాదాపు సగానికి పైగా నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెళ్లడంతో అమరావతి కరకట్టకు, రోడ్డుకు మధ్య భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఉల్లి చేలు నీటిలోనే నానుతున్నాయి. వరి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పంటకు కంకులు వచ్చిన సమయంలో కురిసిన వర్షానికి వరి కంకులు నీటిలోకి వాలిపోయాయి. పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తుఫాన్‌ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదనందిపాడు: పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు గండ్లు పడటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవాణా, విద్యుత్‌ సౌకర్యం లేక ఆహారం, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలోని రాజుపాలెం, పాలపర్రు, పెదనందిపాడు, అన్నవరం, నాగులపాడు, వరగాని, అబ్బినేనిగుంటపాలెం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నల్లమడ వాగును అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ, ఎక్కడా పనులు ప్రారంభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి నాయకులు మాత్రం మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారే తప్ప, ఎక్కడా గండ్లను పూడ్చేందుకు ముందుకు రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగుకు గండ్లు పడటంతో పంటలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదనందిపాడు, నాగులపాడు వద్ద నల్లమడ వాగుకు భారీ గండ్లు పడటంతో వరద నీరు పొలాల్లోకి చేరి పంటలు నాశనమయ్యాయి. మండలంలో సుమారు 1,500 ఎకరాల పంట నీటమునిగింది. బాధిత గ్రామాలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఈ ప్రాంతానికి రాలేదని వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాడేపల్లి రూరల్‌ : నీటిలో మునిగిన వరి పంటను చూపిస్తున్న రైతు

కలెక్టర్‌, ఎస్పీల

పరిశీలన

నల్లమడ వాగుకు పడిన గండ్లను, వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. అధికారులు అందరూ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజన వసతి కల్పిస్తున్నారని చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా పెదనందిపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

వరుస ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను పారదర్శకంగా చేపట్టి, అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. గత ఏడాది మొంథా తుఫాను పరిహారాన్ని వెంటనే విడుదల చేయడంతో పాటు, అర్నబ్‌, మురసు తుఫాన్ల వల్ల జరిగిన నష్టానికి కూడా తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు పెరుగుతున్న పెట్టుబడుల భారం.. ఇంకోవైపు అందని పరిహారం.. వెరసి గుంటూరు జిల్లా రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. పాత నష్టానికి పరిహారం లేదు.. కొత్త నష్టానికి భరోసా లేదు.. చివరకు అన్నదాతకు కన్నీరే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement