చాలా నిరాశగా ఉంది
● రేషన్ దుకాణాల్లో కొరవడిన సరుకులు
● సీఎం ప్రకటనకు విరుద్ధంగా పరిస్థితి
● దీపావళి వేళ దుస్థితిపై
లబ్ధిదారుల ఆవేదన
గుంటూరు వెస్ట్: దీపావళికి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున ఇవ్వాలని గత నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తక్కువ ధరలకు సరుకులు ఇవ్వడం దేవుడెరుగు.. కనీసం ఉన్న సరుకులు కూడా లేకుండా చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో రేషన్ పంపిణీ జరుగుతోంది. అయితే బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ లేవని రేషన్ దుకాణాల యజమానులు చెప్పడంతో ప్రజలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. పండుగ వేళ కూడా పంచదార ఇవ్వకపోతే ఎలా అని ప్రజలు వాపోతున్నారు.
అధికారుల వాదన ఇదీ..
అయితే పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయాల్లో మరో వాదన వినిపిస్తోంది. నిత్యావసర సరుకుల పంపిణీ కాంట్రాక్టు స్థానంలో కొత్తవారిని నియమించామని, అందుకే కొంత ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొన్ని సరుకులైనా ఇస్తామని అంటున్నారు. జిల్లాలో మొత్తం 5,97,931 రేషన్ కార్డులున్నాయి. ఇప్పటికే జిల్లాకు 304 మెట్రిక్ టన్నుల పంచదార మంజూరైందని, అది మార్గమధ్యంలో ఉందని చెబుతున్నారు. అధికారుల అంతర్గత సమస్యలకు ప్రజలకు ఏం సంబంధం? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ఆవేదన చెందుతున్నారు.
మాలాంటి పేదలకు రేషన్ దుకాణాలే కదా దిక్కు. పండుగ వేళ కూడా బియ్యం మాత్రమే ఇవ్వడమేంటి? రేషన్ డీలర్లు మాకు తెలియదని చెబుతున్నారు. మేము ఎవరిని అడగాలి? ప్రస్తుతం ఎన్నికల వేడి నడుస్తున్న తరుణంలో అధికారులు కూడా అందుబాటులో ఉండడం లేదు. పేదవారి కష్టాన్ని పట్టించుకోకపోతే ఎలా?
– ఎం. లక్ష్మి, లబ్ధిదారు


