తెనాలి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగి గంటలైనా కాలేదు. తెనాలి కౌన్సిల్ అత్యధిక స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కౌన్సిల్ సభ్యులు ఇంకా ప్రమాణస్వీకారం చేయనేలేదు. 45వ వార్డులో గెలిచిన మహిళా కౌన్సిలరు భర్త, బంగారు నగల వ్యాపారి పెనుగొండ వెంకటేశ్వరరావు, దుందుడుకు చర్యకు పూనుకున్నారు. బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం వెనుకభాగంలో గల గీతామందిరానికి మధ్య గల గోడను పగులగొట్టించారు. దీనిపై దేవస్థానం కమిటీ సభ్యులు గ్రంధి విశ్వేశ్వరరావు, ఇతరులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వన్‌టౌన్ సీఐ సీహెచ్ రాంబాబు అక్కడకు చేరుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నందున, తర్వాత వచ్చి విచారిస్తానని, అప్పటివరకు ఎవరూ తదుపరి చర్యలకు పూనుకోవద్దని చెప్పి వెళ్లారు. శ్రీవాసవి దేవస్థానం వెనుకవైపుగల గీతామందిరానికి పడమర వైపున మార్గం ఉంటుంది. శ్రీవాసవి దేవస్థానం, గీతామందిరం మధ్యలో గోడను నిర్మించి, ఏదైనా అత్యవసరమైనపుడు ఒకరిద్దరు వెళ్లేందుకు వీలుగా చిన్న గేటును ఏర్పాటుచేశారు. దేవస్థానం అనుబంధ సంస్థలన్నింటికీ ఇదే ఏర్పాటుచేశారు. రెండువైపులా ప్రవేశమార్గాలకు వదిలేస్తే, శ్రీవాసవీ దేవస్థానం ఆస్తులకు, అక్కడి ప్రాంగణంలోని కల్యాణమండపాల్లో వివాహాలు జరిగే సందర్భాల్లో భద్రతా కారణాలరీత్యా దేవస్థానం కమిటీ ఈ ఏర్పాటుచేసింది. గీతామందిరానికి సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పెనుగొండ వెంకటేశ్వరరావు, గతంలోనూ ఇదే తరహాలో మధ్యగోడను పగులగొట్టించారు. అప్పుడు కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పి, ఆలయ ఖర్చులతో పునర్నిర్మించారు. మళ్లీ ఇప్పుడు భార్య కౌన్సిలర్‌గా ఎన్నిక కాగానే మళ్లీ గోడను కూల్చే పని చేశారు. కనీసం ప్రమాణస్వీకారం చేయకుండానే అధికారం అండగా దాష్టీకానికి పూనుకోవటం విమర్శలకు గురవుతోంది.
తెనాలి శ్రీవాసవీ దేవస్థానంలో గోడను కూల్చివేయించిన టీడీపీ కౌన్సిలర్ భర్త


