సగటున 119.2 మి.మీ వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా ఫిరంగిపురంలో 206.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 51.2 మి.మీ వర్షం పడింది. సగటున 119.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమ 175.6 మి.మీ., పెదకాకాని 170.6, మేడికొండూరు 160.4, గుంటూరు తూర్పు 144.4, కాకుమాను 134.2, తాడికొండ 132.4, తుళ్ళూరు 126.6, మంగళగిరి 122.2, తాడేపల్లి 121.2, ప్రత్తిపాడు 117.8, చేబ్రోలు 104, కొల్లిపర 87.9, పెదనందిపాడు 84, దుగ్గిరాల 77.4, తెనాలి 69, వట్టిచెరుకూరు మండలంలో 60.3 మి.మీ చొప్పున వర్షం పడింది.
విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని పెనుమాక గ్రామంలో నివాసముండే ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో బుధవారం సాయంత్రం మృతిచెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. పెనుమాక గ్రామానికి చెందిన కాజా కుమారుడు అమీర్(9) స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటిపైన డాబాపై దీపావళి టపాసులతో ఆడుకుంటున్నాడు. పక్క బిల్డింగ్‌పై మరికొంతమంది పిల్లలు ఆడుకుంటుండగా అమీర్ చేతిలో ఉన్న అగ్గిపుల్లలను వెలిగించి వారిపైకి సరదాగా విసిరివేస్తున్నాడు. ఆ క్రమంలో డాబాకు పిట్టగోడ మధ్యలో ఉన్న ఐరన్ గ్రిల్ పట్టుకుని పైకి ఎక్కి అగ్గిపుల్ల వేసే క్రమంలో బిల్డింగ్‌కు ఆనుకుని వున్న విద్యుత్ స్తంభాల వైర్లు తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ తల్లి, బంధువులు వైద్య నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణానదిలో విద్యార్థి గల్లంతు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఈతకు దిగి ఓ విద్యార్థి గల్లంతైన సంఘటనపై తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి కె.సాయి హర్షిత్ అతని స్నేహితులు ఎన్.నేతాజీ, పి.జగదీష్, సాయిలు ఈత కొట్టేందుకు కృష్ణానది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చి రైల్వే బ్రిడ్జి కింద కృష్ణానది వరద నీటిలోకి దిగారు. అర్ధగంట తరువాత సాయి హర్షిత్ నీటిలో మునిగిపోసాగాడు. మిగిలిన స్నేహితులు ముగ్గురు పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు కొంతమంది సాయి హర్షిత్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే వరద నీటిలో సాయి హర్షిత్ గల్లంతవడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో వెతికించినా ఎటువంటి ప్రయోజనం లభించలేదని, సాయిహర్షిత్ తాత సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖాజావలి తెలిపారు.
పెదకాకాని: తుపాను పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 5, 6, 7 తేదీల్లో జరగాల్సిన ‘వివిఐటియు బాలోత్సవ్ 2026’ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో నీరు నిలవడం, రవాణా సౌకర్యాలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాలోత్సవ్ నిర్వహించే తదుపరి (నూతన) తేదీలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని కమిటీ స్పష్టం చేసింది.
రైతులను ఆదుకుంటాం
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
కొల్లిపర: తుఫాన్ ప్రభావంతో పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు త్వరలోనే గరిష్ట స్ధాయిలో సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రసహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అర్నబ్, మురసు తుపాన్ కారణంగా దెబ్బతిన్న వరి, అరటి పంటలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 72 గంటల్లో వ్యవసాయాధికారులు పంట నష్టం ఎన్యూమరేషన్ పూర్తి చేసి తగు నివేదికను అందించాలని ఆదేశించారు. రైతులు పంటల బీమా పై అవగాహన పెంచుకొని బీమా చేయటం వలన ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పంట నష్టం అందించటం జరుగుతుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఎకరానికి రూ,800 ఖర్చు చేసి బీమా తీసుకోవాలని సూచించారు.


