మంగళగిరి టౌన్: మత్తు రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌పై పోరాటంలో భాగస్వాములు కావాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల సమస్య యువత భవిష్యత్తుతో పాటు సమాజానికి, దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్‌లోని ఏక్తానగర్ వరకు ‘ఫైట్ ఎగైనెస్ట్ డ్రగ్స్ – యునైటెడ్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ ఇండియా’ నినాదంతో నిర్వహించిన జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని బుధవారం మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని రాష్ట్రం నుంచి గుజరాత్ వరకు తీసుకెళ్లిన పోలీస్ సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. పోలీస్ ఉద్యోగ జీవితంలో ఇలాంటి జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అరుదుగా లభిస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఏక్తానగర్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న కమాండెంట్ పీఎండీ ప్రసాద్, ఆర్‌ఐ వి.ఎల్. చంద్రశేఖర్, ఈగల్ హెడ్ కానిస్టేబుల్ జవహర్, 14వ బెటాలియన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు నవీన్, షేక్షవలి, నరసింహులు, నాగచెన్నారెడ్డి, విజయ్ భాస్కర్‌లను ఐజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ బెటాలియన్స్ శ్రీకాంత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈగల్ ఆపరేషన్స్ ఎస్పీ మహేశ్వర రాజు, అడ్మిన్ ఎస్పీ స్వరూప రాణి, స్పెషల్ పీపీ శైలజ, డీఎస్పీలు జయలక్ష్మి, వి.వేణుగోపాల్ రెడ్డి, టి.దుర్గాప్రసాద్, సీఐ రవి, సీఏఓ వాణి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉస్మాన్ బాష తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ సత్కారం


