సమీకృతం.. స్వర్ణోత్సవం | - | Sakshi
Sakshi News home page

సమీకృతం.. స్వర్ణోత్సవం

Oct 2 2026 2:57 AM | Updated on Oct 2 2026 2:57 AM

ఐసీడీఎస్‌ ఆవిర్భవించి నేటితో 50 ఏళ్లు ఉమ్మడి ఏపీలో రెండు ప్రాజెక్టులతో ప్రస్థానం ప్రస్తుతం ఏపీలో 257, ఉమ్మడి జిల్లాలో 23 ప్రాజెక్టులు

ఐసీడీఎస్‌ లక్ష్యాలివి..

తెనాలి: బాలల కోసం జాతీయ విధానానికి అనుగుణంగా సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్‌) భారతదేశంలో 1975లో ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని 1976 అక్టోబరు 2న రెండు ప్రాజెక్టులతో ఆరంభించారు. ఆరేళ్లకన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలు, వారి తల్లులకు పోషకాహార భోజనం, ప్రీస్కూల్‌ విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగనిరోధకత, ఆరోగ్య తనిఖీ, రిఫరల్‌ సేవలను అందించే ప్రభుత్వ కార్యక్రమంగా రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో కంబలూరు, కరీంనగర్‌ జిల్లా ఉట్నూరులో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను తొలుత ఆరంభించారు. వీటి ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో ఐసీడీఎస్‌ను విస్తరించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ప్రాజెక్టులు రద్దవగా, మరికొన్నింటిని విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీలో 257, తెలంగాణలో 149 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 23 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. జిల్లాల విభజనతో ఈ సంఖ్య తగ్గింది. గుంటూరు జిల్లాలో ఆరు, పల్నాడు జిల్లాలో తొమ్మిది, బాపట్ల జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టులుగా విడిపోయింది. విభజన సందర్భంగా కొన్ని ప్రాజెక్టులు రద్దవగా కొన్ని విలీనమయ్యాయి.

లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం!

గత ఐదు దశాబ్దాలుగా ఐసీడీఎస్‌కు నిధులు పెరుగుతున్నా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైందనే విమర్శలున్నాయి. ఇప్పటికీ అనేక సవాళ్లను ఈ వ్యవస్థ ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సత్వర నిర్ణయాలు తీసుకోకపోవటం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పోషకాహారానికి కేటాయింపులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల వేతనాలను పెంపుదల చేయకపోవటం కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

జిల్లాలో 1480 కేంద్రాలు..

గుంటూరు జిల్లాలో ఆరు ప్రాజెక్టుల కింద 1480 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 84,881 మంది చిన్నారుల ఉన్నారు. వీరందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 2022లో పెంచిన ధరలనే ఇప్పటి టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగాయి. మెనూ ప్రకారం పోషకాహారం అందించేందుకు కేటాయింపులు పెంచటం లేదు. మరోవైపు కేంద్రాల నిర్వహణకయ్యే ఖర్చులూ తడిసిమోపెడుగా ఉన్నాయి. వీటినీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇక అంగన్‌వాడీల వేతనాల పెంపుదలపై ఉద్యమాలు చేస్తున్నా ఫలితం శూన్యం. అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికీ కొన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పథకం నిర్దేశిత లక్ష్యాల సాధనకు అవరోధాలు ఇలాంటి కారణాలే దారితీస్తున్నాయి.

పదో పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటై క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్‌ను అనుసంధించారు. పిల్లల పోషణ, రోగనిరోధకతను మెరుగపరచటం, గర్భిణులు, బాలింతలు, శిళు మరణాల శాతం తగ్గించడం, బాలికలకు బాలురతో సమానమైన వనరులను అందించటం ద్వారా లింగ అసమానతను ఎదుర్కోవటం ఈ కార్యక్రమం ఉద్దేశం. పూర్వ ప్రాథమిక విద్య, అనుబంధపోషకాహారం, ఇమ్యూనైజేషన్‌, ఆరోగ్య పరీక్షలు ఇందులో భాగంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement