ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో బీటెక్, డిప్లమో ప్రవేశాలు జరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చేబ్రోలు లింగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో తొమ్మిది కోర్సులను బీటెక్ లో నిర్వహిస్తున్నామని, అందులో అధికశాతం విద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మిషిన్ లెర్నింగ్ కోర్సులో 66 కి 64 మంది, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో 62 కి 60 మంది, సైబర్ సెక్యూరిటీ కోర్సులో 65కి 63 మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో 66కి 64మంది ప్రవేశాలు పొందారన్నారు. అలానే డేటా సైన్స్ కోర్సులో 66 కి 63 మంది, ఈసీఈ కోర్సులో 66కి 66 మంది, ఈఈఈ కోర్సులో 65కి 64 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో 65కి 64 మంది, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 44 కి 15 మంది ప్రవేశాలు పొందినట్లు లింగరాజు స్పష్టం చేశారు. అలాగే డిప్లమో ద్వారా 74 మందికి 72 మంది ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. మొత్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినిరింగ్ కళాశాలకు 536 మందిని అలాట్ చేయగా వారిలో 522 మంది చేరినట్లు పేర్కొన్నారు. 97శాతం బీటెక్ సీట్లు భర్తీ అయ్యాయని లింగరాజు పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించి వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి, కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, ల్యాబ్స్, ఆధునిక రీడింగ్ రూములు, లైబ్రరీ, వంటి సౌకర్యాలు కల్పించడంతో అడ్మిషన్లు పెరిగినట్లు వివరించారు. రికార్డు స్థాయిలో ప్రవేశాలు జరిగేందుకు సహకరించిన అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ చంద్రమౌళి, విభాగాధిపతులు, కో–ఆర్డినేటర్లు, అధ్యాపకులు, ఉద్యోగులను సీహెచ్ లింగరాజు అభినందించారు.


