రొంపిచర్ల: రానున్న స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి సూచించారు. గురువారం రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌న్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషనన్‌్ పరిసరాలను పరిశీలించిన అనంతరం రికార్డులు తనిఖీ చేసి కేసుల నమోదు, దర్యాప్తు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీసిన ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖపై నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. తనిఖీలో నరసరావుపేట రూరల్ సర్కిల్ సీఐ ఎంవి సుబ్బారావు, రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణిగా డాక్టర్ ఎం.పద్మావతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల ద్వారా అందుతున్న సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ప్రోగ్రామ్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఇద్దరిపై కేసు నమోదు
పొన్నూరు: పట్టణంలో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై గురువారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్సు బృందం దాడులు నిర్వహించింది. టాస్క్‌ఫోర్సు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శాంతినగర్ 2వ లైనులో 13వ నెంబర్ రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం వాహనంలో తరలించేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 171 బస్తాల్లోని 8,550 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై 6ఏ, క్రిమినల్ నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం వాహనాన్ని విచారణ, చట్టపరమైన చర్యల కోసం పట్టణ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్రమ రవాణా చేసే సమయంలో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలు 171 కాగా, స్థానిక పౌర సరఫరాల అధికారులు వాహనంలో ఎక్కించిన 23 బస్తాలతోపాటు డిపోలో లెక్కకు మించి ఉన్న మరో ఏడు బస్తాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరాల డీటీ దుర్గారావు తెలిపారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు గురువారం 4,808 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 206 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,290 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 488, పశ్చిమ కాలువకు 69, నిజాంపట్నం కాలువకు 269, కొమ్మమూరు కాలువకు 1,520 క్యూసెక్కులు విడుదల చేశారు.


