అధికారం అండగా ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

అధికారం అండగా ఇష్టారాజ్యం

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

ఏఎన్‌యూలో ఒక సామాజిక వర్గం చేతుల్లోనే పదవులు, పెత్తనం ● అకడమిక్‌–ఇండస్ట్రీ సమ్మిట్‌ పేరుతో రూ. 50 లక్షలు ఖర్చు ● సిల్వర్‌ జూబ్లీ వేడుకల ఖర్చులు, విరాళాల సంగతి దేవుడికే తెలియాలి ● ఏం చేసినా అడిగేది ఎవరనే ధోరణిలో ఆ సామాజిక వర్గం అధికారులు ● చివరకు ఉత్తమ అధ్యాపకుల అవార్డులు కూడా ఏకపక్షం ● వైఎస్సార్‌సీపీ పాలనలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం

ఏఎన్‌యూలో ఒక సామాజిక వర్గం చేతుల్లోనే పదవులు, పెత్తనం

సాక్షి ప్రతినిధి, గుంటూరు ఎన్నికలకు ముందు వ్యవస్థలో మనమందరం, ఎన్నికల తరువాత మేమే అందరం అన్నట్లుగా ఆ సామాజిక వర్గ వ్యవహార శైలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక యూనివర్సిటీలో పలు కార్యక్రమాల నిర్వహణ విషయంలో కూడా కనీస జవాబుదారీతనం లేకపోవడం, ఒక సామాజిక వర్గ అధికారులే రహస్యంగా ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో 2019 – 2024 వరకు వైఎస్సార్‌సీపీ పాలనలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాలన, కార్యనిర్వహణ పదవులు, పలు కీలక కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు వంటి అంశాల్లో అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. యూనివర్సిటీలో కీలక పదవులైన వీసీ, రెక్టార్‌, రిజిస్ట్రార్‌ పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ ఒక పదవి ఎస్సీ, ఒక పదవి బీసీ, ఒక పదవి ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వడమే కాకుండా ఇతర పదవుల్లోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. బీసీ, ఎస్సీ వర్గాలకు అధిక పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో వీసీ, రెక్టార్‌ పదవులు రెండూ ఓసీలోని ఒక బలమైన సామాజిక వర్గం వారి చేతుల్లోనే ఉన్నాయి. సమాజంలో అతి తక్కువ జనాభా కలిగిన ఈ సామాజిక వర్గం అధ్యాపకులు యూనివర్సిటీలో ఏడుకుపైగా కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

అడ్డగోలుగా తొలగింపులు

వైఎస్సార్‌సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవర్గాలకు చెందిన 150 మంది నిరుద్యోగ యువతకు కాజువల్‌ వర్కర్లు తదితర ఉపాధి అవకాశాలు యూనివర్సిటీలో కల్పిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేసినా తమను అడిగేది ఎవరన్నట్లుగా వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. అదే సమయంలో యూనివర్సిటీలో, ఇతర శాఖల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి మరలా ఏఎన్‌యూలో ఉద్యోగాలు ఇచ్చి భారీగా వేతనాలు ఇవ్వడంతోపాటు వారికి అధికారాలు కట్టబెట్టారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి, నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్‌యూలో ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే వ్యవస్థ పనిచేయడం చూసిన విద్యావేత్తలు నిర్ఘాంతపోతున్నారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు వర్గం ‘వ్యవస్థలో మనమందరం అని’ నమ్మబలికిందని గుర్తుచేశారు. ఎన్నికల తరువాత ‘మేమే అందరం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు మండిపడుతున్నారు. చివరకు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అందించే రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులనూ ఆ సామాజిక వర్గానికే చెందిన ముగ్గురిని ఎంపిక చేసి సీఎం, విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందించడంపై అంతా విస్తుపోయారు. ఇందులో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఓ అధ్యాపకునికీ ఉత్తమ అవార్డు ఇవ్వడం చూస్తుంటే కులం కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఖర్చుల సంగతేంటి?

ఇటీవల వర్సిటీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. తక్కువ ఖర్చుతో నిర్వహించాలని సూచనలు వచ్చాయి. స్పాన్సర్‌షిప్‌ రూపంలో సమకూరుతాయని ఒక ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ముగిసిన తరువాత వర్సిటీ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని ప్రతిపాదించడం విశేషం. ఎవరు ఎంత స్పాన్సర్‌ చేశారు, ఎందుకు ఖర్చు చేశారు అనేది ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నగదు కొందరి జేబుల్లోకి వెళ్లిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నియోజకవర్గంలో ఉన్న ఏఎన్‌యూలో ఒక సామాజిక వర్గం ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించడం, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించడం రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ పరిస్థితికి అద్దం పడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వర్సిటీలో కీలక పదవి పొందిన ఒక అధికారి ఇటీవల అకడమిక్‌–ఇండస్ట్రీ సమ్మిట్‌ పేరుతో మూడు రోజులపాటు ఒక కార్యక్రమం నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా వ్యవస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని, ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు. విదేశీ కంపెనీల పేరుతో ఒక సామాజిక వర్గం వారే పాల్గొనడం, ఎంఓయూల పేరుతో సన్మానాలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏఎన్‌యూకి గతంలోనే 150కిపైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూలు ఉన్నా సరిగా అమలు కావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, కొత్త వాటి పేరిట హడావుడి చేయడం కేవలం గోబెల్స్‌ ప్రచారమేనని, సీఎం చంద్రబాబు దారిలోనే ఏఎన్‌యూ నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తాయని చెప్పారు. సంగం డైరీ, పలు కంపెనీల పచ్చళ్లు, స్థానికంగా లభించే చీరలు, పోస్టర్ల తయారీ తదితర స్టాల్స్‌ దర్శనమిచ్చాయి. దీనికే రూ. 50 లక్షల వరకు వర్సిటీ నిధులు నీళ్లలా ఖర్చు చేసినట్లు సమాచారం. వర్సిటీ ఆర్థిక సంక్షోభంలో ఉందని, వేతనాలు ఇవ్వలేమని 150 మంది వరకు పేద యువకులను ఉద్యోగాల నుంచి తొలగించిన పాలకులు, వ్యక్తిగత ప్రచారానికి రూ.అరకోటి ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’’ అన్న చందాన అధికారపార్టీ నేతలు, ఆ సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వర్సిటీలు సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి. ఆ వర్సిటీల వేదికగా జరిగే విద్య, పరిశోధన అంశాలతోపాటు పాలన, కార్యనిర్వహణ, సామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆదర్శంగా నిలవాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకం, నిర్ణయాల అమలు ఉండాలి. కానీ ఆచార్య నాగార్జున వర్సిటీలో మాత్రం వీటికి అతీతంగా పదవులు, పెత్తనం వంటి అన్ని అంశాల్లోనూ ఒక సామాజిక వర్గ ఆధిపత్యమే కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement