1,119 మంది బాధితులకు రూ.31.75 లక్షలు అందజేత
నగరంపాలెం: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సైబర్ మోసాల్లో బాధితులైన 1,119 మందికి రూ.31.75 లక్షలను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించి మనీ రెస్టొరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం) విధానాన్ని ఈ ఏడాది జూన్ నుంచి సైబర్ సెల్ అమలు చేస్తోందని అన్నారు. సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన నగదును నిర్దేశిత ప్రక్రియ ద్వారా కోర్టు ఆదేశాలు అవసరం లేకుండా తిరిగి చెల్లించేందుకు ఎంఆర్‌ఎం విధానం ఉపయోగకరమని తెలిపారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే మోసగాళ్ల ఖాతాల్లోని నగదును ఫ్రీజ్ చేయవచ్చని అన్నారు. తద్వారా పోగొట్టుకున్న నగదును వెంటనే పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అపరిచితులకు ఓటీపీలు, ఏటీఎం పిన్‌లు, సీవీవీ, బ్యాంకింగ్ వివరాలు చెప్పొద్దని అన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్లను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌లలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని స్పష్టంచేశారు. ఈడీ, నార్కోటిక్స్, సీఐడీ, ముంబయి పోలీసులు తదితర అధికారులమని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి డబ్బులు వసూలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని చెప్పారు. జిల్లా సైబర్ సెల్ సీఐ నిషార్ బాషా పాల్గొన్నారు.


