గుంటూరు లీగల్: మధ్యవర్తిత్వం నిరంతర ప్రక్రియ అని, ఇందులో మధ్యవర్తుల పాత్ర చాలా ముఖ్యమైనదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా వ్యాప్తంగా మధ్యవర్తులకు, పారా లీగల్ వలంటీర్స్‌కు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0లో భాగంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెనాలిరూరల్: గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెనాలి మండలంలోని పెదరావూరు జెడ్పీ హైస్కూలును తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్‌ఏ–వన్ మార్కులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నుంచి జరిగే ఎఫ్‌ఏ–టూ పరీక్షలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని సూచించారు. ె అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాత్రలు మింగించారు. డీఈవో వెంట తెనాలి మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతిబాబు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఫైనల్‌కు గోదావరి గోల్డెన్ ఈగల్స్
మంగళగిరిరూరల్: మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఉమెన్‌న్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసింది. పుష్పిత 56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 34 పరుగులు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్ బర్డ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులకే పరిమితమైంది. యశస్విని 23, హాసిని 20 పరుగులు చేశారు. గోదావరి గోల్డెన్ ఈగల్స్ బౌలర్లలో శ్రీష్టి శేఖర్ రెండు వికెట్లు, వైష్ణవి, హారిక, అక్షయ ఒక్కో వికెట్ తీశారు. అద్భుత బ్యాటింగ్‌తో 91 పరుగులు చేసిన పుష్పితకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తెనాలిరూరల్: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన యువకుడు చీకటి గోపి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృంద సభ్యులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం విచారణ జరిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీకాంత్, ఇతర వైద్యుల నుంచి వివరాలను సిట్ సభ్యులు గుంటూరు ట్రాఫిక్ సీఐ డి. కోటేశ్వరరావు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య నమోదు చేశారు.
ఎయిమ్స్‌లో అదనపు ఫార్మసీ కౌంటర్లు ప్రారంభం
మంగళగిరి రూరల్: ఎయిమ్స్‌లో ఫార్మసీ అదనపు కౌంటర్‌లను ప్రారంభించారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓపీడీ బ్లాక్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన కొత్త ఓపీడీ ఫార్మసీ బ్లాక్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. అంకితభావంతో సేవలందిస్తున్న ఫార్మాసిస్టులను సత్కరించారు.


