గుంటూరు వెస్ట్: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో అక్టోబర్ 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లులు, చిన్నారులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా కార్యకర్తలను, కొందరు తల్లులను సన్మానించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన తెలుగు కామిక్ పుస్తకాన్ని ఉపయోగించి కథల రూపంలో కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిన్నారులకు ఆటలు, చిత్రలేఖనం, పాటలు, కథలు, పద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల నివేదికలను సమర్పించాలని సూచించారు.


