న్యూస్‌రీల్
మేయర్ పదవిపై టీడీపీ సామాజిక వర్గం నేతల కన్ను ఓసీ మహిళకు కేటాయించేలా చినబాబు ద్వారా పైరవీలు బీసీకి కేటాయిస్తారనే వార్తలతో టీడీపీ సామాజిక వర్గం అప్రమత్తం 76 డివిజన్లలో 15 మాత్రమే జనసేన, బీజేపీలకు కేటాయించేలా పావులు ఇప్పటి నుంచే అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొనే పనిలో నాయకులు
ఎవరి ప్రయత్నాలు వారివి..
గుంటూరు
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.5261 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమిలో గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల వేడి మొదలైంది. జీఎంసీ పాలకవర్గం గడువు మార్చి 17వ తేదీతో ముగిసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మేయర్, కార్పొరేటర్ పదవులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం... తదుపరి కార్యాచరణ అమలుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
మేయర్‌పై జోరుగా చర్చ
మేయర్ పదవి ఎవరికి రిజర్వ్ అవుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. పైగా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మేయర్‌ను ఎన్నుకోనున్న నేపథ్యంలో ఈ కుర్చీ కోసం కూటమిలో పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు దఫాలుగా మేయర్ స్థానం ఓసీలకే ఇస్తున్నారు. ఈసారి బీసీకి కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపించడంతో టీడీపీ సామాజిక వర్గం నేతలు అప్రమత్తమయ్యారు. ఓసీ మహిళకు కేటాయించేలా చూడాలని జిల్లా ముఖ్యనేతల ద్వారా చినబాబు వద్ద పైరవీలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇందుక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది.
ఖర్చు భరిస్తేనే...
కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఈ సీటు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. రాజధాని జిల్లా కావడంతో మేయర్‌కు అన్ని విషయాల్లో ప్రొటోకాల్ ఉంటుందని అధిష్ఠానం చెబుతోంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంత పెట్టేందుకు ముందుకు వచ్చే వారికే అవకాశం కల్పిస్తుందనే వాదన టీడీపీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో తమకు ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని, మేయర్ స్థానాన్ని ఇవ్వాలని ఆర్యవైశ్య సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతలు సైతం గట్టిగా అడుగుతున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొల్లి శారద, రాయపాటి మోహన సాయికృష్ణలు మేయర్లుగా పనిచేసినందున ఈసారి తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.
అధిష్ఠానం మదిలో వీరు...
టీడీపీ అధిష్ఠానం మాత్రం అందుకు భిన్నంగా పార్టీలకు సంబంధం లేని బిగ్‌షాట్లను బరిలో దించే ఆలోచనలో ఉందని సమాచారం. ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యురాలిని అభ్యర్థిగా నిలిపితే ప్రత్యక్ష ఎన్నికలు కావడం వల్ల అన్ని వర్గాలు కలిసి వస్తాయని భావిస్తోంది. ఆర్థిక పరంగానూ ఇబ్బందులు ఉండవని యోచిస్తున్నట్లు తెలిసింది. కమ్మ సామాజిక వర్గంలో పోటీ వల్ల పార్టీలో ఉన్న నేతల్లో ఎవరికి ఇచ్చినా మిగతావారు వర్గాలుగా విడిపోతారనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
జనసేన పావులు
జనసేన నేతలు సైతం వారి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను మేయర్ అభ్యర్తిగా బరిలోకి దించే యోచన చేస్తున్నట్లు సమాచారం. మేయర్ స్థానం బీసీలకు రిజర్వు అయితే ఓ వైద్యుడిని బరిలోకి దించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయనైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మాదిరిగా తన చుట్టూనే తిరుగుతారనే యోచనలో ఇలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
రెండు పార్టీలకు మొండి చేయేనా?
కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు సైతం మేయర్ స్థానంపై కన్నేశారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ మినహా ఎవ్వరికీ ఎంపీ, ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదని, మేయర్ స్థానాన్ని తమకు కేటాయించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మరో వైపు బీజేపీ నేతలు సైతం ఈసారి మేయర్ పదవి తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉండగా, వాటిని 76 డివిజన్లుగా పెంచారు. ఈ నేపథ్యంలో సగం స్థానాలు తమకు కేటాయించాలని జనసేన, బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఇద్దరికీ కలిపి కేవలం 15 డివిజన్లు మాత్రమే ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఎన్నికల సమయానికి పంపకాల విషయంలో రాజీ పడతారా... లేక రెబల్స్‌గా మారి పోటీకి దిగుతారా అనేది వేచి చూడాలి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వర్గాలవారీగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు.
ఆర్ అండ్ ఆర్ సర్వే పూర్తి చేయాలి
గుంటూరు వెస్ట్ టికెట్ బదులు కేవలం ఏడాది మాత్రమే మేయర్ పదవి తనకు ఇచ్చారని, ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని కోవెలమూడి రవీంద్ర (నాని) అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నగరంలో ద్వితీయ శ్రేణి నేతలుగా ఉన్న ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ (బుజ్జి), మాదల చైతన్య, అబ్బూరి మల్లి, కాపుల్లో అయితే డేగల ప్రభాకర్... ఇలా అనేక మంది మేయర్ పదవి ఆశిస్తున్నారు. కొంతమంది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంతమంది జిల్లాలోని ఇతర సీనియర్ నేతల ద్వారా పావులు కదుపుతున్నారు.


