మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం ఇందిరానగర్ ప్రాంతంలో గురువారం కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మేకల సతీష్‌బాబు, ఎకో పార్క్ సిబ్బంది, హనుమాన్ టీం సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ నిబంధనల మేరకు అరణ్యరామం (బ్రహ్మానందపురం) అటవీ ప్రాంతానికి తరలించి అడవిలో వదిలిపెట్టారు. మంగళగిరి, పరిసర ప్రాంతాల్లో పాములు లేదా ఇతర వన్యప్రాణులు కనిపిస్తే 99668 09162, 83418 18594 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) గుంటూరు జిల్లా మహాసభలు శనివారం నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. జిల్లా మహాసభలకు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మదిర నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో సిట్ బృందం సభ్యులు పర్యటించారు. సిట్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, సౌత్ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావులు చీకటి గోపీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గోపీ భార్య, తల్లి, సోదరి, సోదరుడితో మాట్లాడి వివరాలను వాంగ్మూలాల రూపంలో రికార్డు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9 గంటల తరువాత వరకు వీరి పర్యటన కొనసాగింది. పోలీసులు కొట్టినందునే చీకటి గోపీ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు విచారణలో వెల్లడించారు. టీడీపీ నాయకుడు, మాజీ రౌడీషీటర్ నెల్లూరి రాజా వివాహేతర సంబంధానికి అడ్డుగా మాట్లాడామని తమపై కేసు పెట్టించి పోలీసులకు చెప్పి మరీ చీకటి గోపీతోపాటు తనను కొట్టించాడని చిత్తచర్ల గోపీ విచారణ బృందానికి తెలిపాడు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, అరండల్‌పేట ఎస్ఐ అశోక్‌లు తెనాలి ఆసుపత్రిలో విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం.
కొరిటెపాడు(గుంటూరు): ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు, వివిధ యూనియన్ల నాయకులు జోరు వర్షంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పని ఒత్తిడిని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


