జిల్లాలో రోజంతా వర్షమే వాయుగుండం ప్రభావంతో భారీగా వాన లోతట్టు ప్రాంతాలు జలమయం చేబ్రోలులో అత్యధికంగా 103 మి.మీ. వర్షపాతం జిల్లా సగటు 66.40 మి.మీ.గా నమోదు
అప్రమత్తంగా ఉండాలి
పలు ప్రాంతాల్లో నిలిచిన నీరు
కొరిటెపాడు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించింది. గుంటూరు నగరంతో పాటు పలు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫుట్‌పాత్ వ్యాపారులు ఉపాధి కోల్పోగా, అత్యవసర పనులు ఉన్నవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మాత్రమే బయటకు వచ్చారు. భారీ వర్షం కారణంగా పనులు దొరక్క రోజువారీ కూలీలు ఇంటిబాట పట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం ఉదయం 7 గంటలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1912, కలెక్టర్ కార్యాలయం నంబర్ 0863–2234014లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సూచించారు.
నగర వాసులకు నరకయాతన
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని వర్షం ఎత్తి చూపింది. కొద్దిపాటి వర్షానికే పలు ప్రాంతాలు జలమయం కావడం, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం, తవ్వేసి సరిగా పూడ్చని రోడ్లు బురదమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురిస్తే గుంటూరు నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టి, పనులు పూర్తయిన తర్వాత సక్రమంగా మట్టితో పూడ్చకపోవడంతో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై గుంతలు, బురదతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చేబ్రోలులో 103 మి.మీ. వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా 66.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే మొత్తం 1,194.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 103 మి.మీ పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 28.8 వర్షం పడింది. సగటున 66.4 గా నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్లిపర మండలంలో 92.8, గుంటూరు పశ్చిమ 89.2, తెనాలి 82, దుగ్గిరాల 81, గుంటూరు తూర్పు 79.4, మంగళగిరి 76.6, తాడేపల్లి 75.6, మేడికొండూరు 69.4, తుళ్లూరు 68.4, వట్టిచెరుకూరు 66.2, పెదకాకాని 60.4, తాడికొండ 55.4, పొన్నూరు 54.8, ఫిరంగిపురం 50.2, కాకుమాను 31.2, ప్రత్తిపాడు మండలంలో 30.4 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ప్రస్తుత అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
నీటి విడుదల
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. గురువారం రాత్రి 12 అడుగులకు చేరడంతో దిగువకు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజేష్ తెలిపారు. ప్రస్తుతం 20 గేట్లు అడుగు మేర ఎత్తి 14,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం వరద ఉదృతిని బట్టి గేట్లు ఎత్తుతామని, కృష్ణానది ఎగువ ప్రాంతంలో తట్లేరు, బుడమేరు, కీసర, చిన్న చిన్న వాగులు తదితర ప్రాంతాల నుండి వరద నీరు కృష్ణానదికి వచ్చి చేరుతుందని ఆయన తెలిపారు.
మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, కొన్ని ప్రాంతాల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫారెస్ట్ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. పలుచోట్ల ఆయిల్ ఇంజిన్లు, సెప్టిక్ ట్యాంకుల ద్వారా వర్షపు నీటిని తోడేస్తున్నారు.
దుగ్గిరాల మెయిన్ రోడ్ నుంచి మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారిలో భారీ వర్షానికి పెద్ద చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి చేబ్రోలు మండలం నారాకోడూరులో ఇళ్లపై భారీ వృక్షం పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
తాడికొండ మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాల్లో నీరు చేరడంతో ముంపు వల్ల పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షం వల్ల జనజీవనం స్తంభించి, కార్యకలాపాలకు ఇబ్బందికరంగా మారింది.


