రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజు బాలల హక్కులపై జిల్లా జేసీతో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష
గుంటూరు వెస్ట్: పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు, రక్షణ కల్పించడం ప్రతి ప్రభుత్వ శాఖ బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజు తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, కమిషన్ సభ్యులు కె.జి.వి.పద్మలత, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను పరిశీలించామని తెలిపారు. ప్రతి చిన్నారి హక్కులను పరిరక్షించడం, వారికి ఆరోగ్యం, విద్య, భద్రత, పోషణ వంటి సదుపాయాలు అందేలా చూడటం అందరి బాధ్యతన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల సంక్షేమం కోసం కేటాయిస్తున్న ప్రజాధనం సక్రమంగా వినియోగమై, దాని ప్రయోజనాలు పూర్తిగా పిల్లలకు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను మరింత చురుకుగా పనిచేసేలా చూడాలని సూచించారు.
శాఖల పనితీరు మెరుగుపడుతుంది
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ఐసీడీఎస్ శాఖ పనితీరు గత ఆరు నెలల్లో గణనీయంగా మెరుగుపడిందని, ఇంకా కొన్ని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాల నియంత్రణలో అవగాహన కార్యక్రమాల నిర్వహణతోపాటు విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పోలీస్, ఇతర శాఖలకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, డీసీసీపీ విజయ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.


