నాలుగు జోన్లుగా ప్రతిపాదనలు సిద్ధం నూతన భవనాలకు రూపొందిన అంచనాలు
విభజన ఇలా..
గుంటూరు జోన్ కింద లాలాపేట, కొత్తపేట, పాతగుంటూరు, అరండల్‌పేట, పట్టాభిపురం, నగరంపాలెం, నల్లపాడు, మహిళా పీఎస్ రానున్నాయి.
గుంటూరు రూరల్ జోన్ కింద పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరింగిపురం వస్తాయి.
అమరావతి క్యాపిటల్ రీజియన్ కింద తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, దుగ్గిరాల, పెదకాకాని ఉంటాయి.
తెనాలి జోన్‌లో తెనాలి వన్‌టౌన్, తెనాలి టూటౌన్, తెనాలి త్రీ టౌన్, తెనాలి రూరల్, కొల్లిపర, చేబ్రోలు, పోన్నూరు టౌన్, పొన్నూరు రూరల్ రానున్నాయి.
ఈ నాలుగు జోన్లలో నలుగురు డీసీపీలను నియమించనున్నారు. అలాగే సీసీఎస్, గుంటూరు ట్రాఫిక్–1, గుంటూరు ట్రాఫిక్–2, తుళ్ళూరు ట్రాఫిక్, తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, ఏఆర్ తదితర విభాగాలన్నీ మరో డీసీపీ పరిధిలోకి రానున్నాయి. దీన్ని మరో కోఆర్డినేషన్ డీసీపీ పర్యవేక్షిస్తారు.
నగరంపాలెం: రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గుంటూరు జిల్లాను కమిషనరేట్‌గా మార్చేందుకు ఆమోదముద్ర లభించింది. 2014 నాటికే గుంటూరు ఉమ్మడి జిల్లాను గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ పోలీసు జిల్లాలుగా విభజించారు. అధికారులను, సిబ్బందిని కేటాయించారు. వారి బదిలీలు కొంతవరకు గజిబిజిగా మారాయి. తర్వాత గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ జిల్లాలను గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సర్దుబాటు చేశారు. దీంతో మళ్లీ బదిలీల పక్రియ మొదలైంది. గుంటూరు పునర్విభజన ముగిసిందనే సరికి మళ్లీ గుంటూరు జిల్లాను కమిషనరేట్‌కు మార్చారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ...
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఆరు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. అందులో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, గుంటూరు దక్షిణ, గుంటూరు ఉత్తర, తెనాలి, తుళ్ళూరు ఉన్నాయి. ఆయా సబ్ డివిజన్ల పరిధిలో 28 లా అండ్ అర్డర్ (టెరిటోరియల్) పోలీస్‌స్టేషన్లు ఉండగా, అదనంగా నాలుగు ట్రాఫిక్, ఒక సెంట్రల్ క్రైమ్ (సీసీఎస్), మహిళా పోలీస్‌స్టేషన్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), డీసీఆర్‌బీ తదితర ప్రత్యేక విభాగాలు కలిపి 34 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి.
అవసరం ఇలా..
పోలీస్ కమిషనరేట్‌కు ఒక ఐజీ, ఐదుగురు ఐపీఎస్‌లు అవసరం. అదనంగా ఒక ఐజీ నలుగురు ఎస్పీలు, ముగ్గురు ఏఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 19 మంది సీఐలు, అరవై మంది ఎస్‌ఐలు, వంద మంది ఏఎస్‌ఐ లు, 200 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 850 మంది కానిస్టేబుళ్లు, 75 మంది మినిస్టీరియల్ సిబ్బంది, 450 మంది హోంగార్డులు అవసరం అవుతారు. పోలీస్ కమిషనరేట్, ఐదుగురు ఐపీఎస్ అధికారులు, ఇతరత్రా కార్యాలయాల నూతన భవనాలకు నిర్మాణ వ్యయాలను సైతం రూపొందించారు. సీపీ కార్యాలయానికి రూ.25 కోట్లు, ఐదుగురు డీసీపీ కార్యాలయాలకు రూ.20 కోట్లు, పోలీస్ అధికారులు విధుల నిమిత్తం వినియోగించనున్న కార్లకు రూ.60 లక్షలు ఖర్చు కానున్నాయని అంచనా తయారుచేశారు. ఇతర అవసరాలతో కలిపి వీటిన్నింటికి రూ.45.60 కోట్లు ఖర్చు కానున్నాయి.
ఆరు సబ్ డివిజన్లను గుంటూరు జోన్, గుంటూరు రూరల్ జోన్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లుగా విభజించనున్నారు.


