వద్దంటున్నా నిర్బంధంగా నోటిఫికేషన్ ఉపాధ్యాయుల ఆకాంక్షలపై టీడీపీ సర్కారు నిర్లక్ష్యం తమ ప్రతిపాదనల్లో ఒక్కటీ పట్టించుకోలేదని మండిపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం
ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి
మినహాయింపు ఇవ్వాల్సిందే..
గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ సర్కారు రెండు రోజుల క్రితం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇన్ సర్వీసు టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. సాధారణ డిగ్రీలతో వత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు వ్యవధి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయాలని వివిధ ఆందోళనలు, నిరసనలు ద్వారా ప్రభుత్వానికి తమ గళం వినిపించారు. 2009లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం దేశంలో టెట్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారు సైతం టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వారు 2028 ఆగస్టు ఒకటో తేదీలోపు టెట్‌లో ఉత్తీర్ణత కావాల్సి ఉంది.
టీడీపీ సర్కారు నిర్లక్ష్యం
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ సర్కారు ఈ మేరకు ఒత్తిడి తెచ్చి టెట్ నుంచి ఇన్ సర్వీసు టీచర్లకు మినహాయింపు కల్పించేలా చట్ట సవరణకు చేయించాలని ఉపాధ్యాయ సంఘాలు వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేశాయి. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నుంచి మినహాయింపు సాధ్యపడుతుంది. అయితే టీడీపీ సర్కారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)ను సవరించేలా కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. ఆ విధంగా సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ సామాజిక వర్గం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు.
ఉపాధ్యాయులపై కక్ష సాధింపు
12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేయడంతోపాటు గత పీఆర్‌సీ, డీఏ బకాయిల చెల్లింపులు, యాప్‌ల భారం నుంచి విముక్తి కల్పించాలని ఆందోళనలు, ధర్నాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. దీంతో వారిపై ప్రభుత్వం కక్ష గట్టింది. అందుకే ఉపాధ్యాయులు ప్రతిపాదించిన విధంగా ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ నెల 5 నుంచి 16 వ తేదీ వరకు సాధారణ టెట్ నిర్వహించారు. సెప్టెంబర్ 15న ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, ఈలోపు స్పెషల్ టెట్ పేరుతో మరో నోటిఫికేషన్‌ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ దీనికి దరఖాస్తు చేయాలా, పరీక్ష ఫీజు చెల్లించాలా, లేదంటే గత టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులు, వెయిటేజీ, పరీక్ష విధానంలో సైతం ఎటువంటి మార్పులు లేకుండా విడుదల చేసిన దీనిని ప్రత్యేక టెట్ అని ఎలా అంటారు, అసలు దీని లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక టెట్‌ను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో ఏళ్ల కిందట ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్‌లైన్ సాధ్యం కాదని, రాత విధానంలో నిర్వహించాలని సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
వేల మందికి కష్టాలు
సర్కారు తీరుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 8 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడనుంది. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 12,180 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ యాజమాన్యంతోపాటు నగరపాలక, పురపాలక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరో మూడు వేల మంది ఉన్నారు. జిల్లాల వారీగా జెడ్పీ, మండల పరిషత్ ఉపాధ్యాయుల సంఖ్య పరిశీలిస్తే గుంటూరులో 3,382, పల్నాడులో 6,695, బాపట్లలో 2,103 మంది ఉన్నారు.
దైనందిన వృత్తిలో అనేక ఒత్తిళ్ల మధ్య పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రశాంతంగా చదివే సమయం ఎక్కడ ఉందో ప్రభుత్వమే చెప్పాలి. స్పెషల్ టెట్ ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి. ఏ సబ్జెక్టు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు అదే సబ్జెక్టుకు పరిమితం చేసే విధంగా మార్పులు చేయాలి. లేని పక్షంలో ఉద్యమబాట పడతాం. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగా ఇక్కడా చేయాలి.
– ఎం. కళాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి. సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల తమ ఉద్యోగ భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్పు కాదు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రాతినిధ్యం చేసే హక్కు మాకూ ఉంది.
– టి. శేషిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్
వారందరు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించి, అత్యంత క్లిష్టమైన వడపోతలను దాటుకుని ఉపాధ్యాయ కొలువులు పొందారు. ఏళ్ల తరబడి విద్యాబోధనలో సుదీర్ఘమైన అనుభవం గడించిన వారే. ప్రస్తుతం టెట్ ఓ గుదిబంగా మారింది. వృత్తిపరమైన అర్హతలు నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస మినహాయింపులు కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై మండిపడుతున్నారు.


