నీటి విక్రయాల కోసం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు అధికారం అండతో గ్రామంలో పట్టు సాధించేందుకు రాజకీయాలు రెండు వర్గాల వివాదంతో బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత అవసరాలకు నీరు అందక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
గుంటూరు రూరల్: అధికారంలోకి రాగానే గ్రామంలో పట్టు సాధించాలని కొందరు, గ్రామంలో నీటి విక్రయాలతో డబ్బు సంపాదించుకోవాలని మరికొందరు వర్గాలుగా విడిపోయారు. తమ స్వార్థం కోసం వారు చేస్తున్న రాజకీయాలు గ్రామంలో ప్రజలను ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నీటి విక్రయాలపై రాజకీయ కుట్రలు జరుగుతూనే ఉన్నాయని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అసలే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఎండిపోయి మూగ జీవాలు సైతం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు పచ్చ నేతలు మాత్రం శివారులోని బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల గ్రామంలో నీటి విక్రయాలు రాజకీయ రంగు పులుముకొన్నాయి. అదీ అధికార పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే కావడం ఇక్కడ గమనార్హం.
ఎమ్మెల్యేతో గొడవలు..
గ్రామానికి చెందిన డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు గ్రామంలో తాగునీటి విక్రయాలు చేస్తున్నారంటూ వాటర్ ట్యాంకర్లను, ఇసుక తరలించే ట్రాక్టర్లు, లారీలను గతంలో నిలిపివేసి అధికారులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గ్రామంలో పట్టు సాధించుకునేందుకు, ఉనికిని కాపాడుకునేందుకు జరుగుతోందని పలువురు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై హరిబాబు సైతం ఎమ్మెల్యే వద్దకు వెళ్లి నీటి విక్రయాలకు కొందరికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారని తెలిసింది. ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుందని సమాచారం. తన నియోజకవర్గంలో పనేంటని ఎమ్మెల్యే స్వయంగా హరిబాబును ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో గ్రామంలో అధికార పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడి గ్రామ శివారుల్లో పొలాలకు నీరు పెట్టుకునే బోర్ల నుంచి.. మిగతా అన్ని బోర్లకు విద్యుత్ సౌకర్యం లేకుండా చేశారు.
మూగజీవాలకూ కష్టాలే
వర్షాలు కురిసి చెరువులో నీరు ఉంటే మూగజీవాలైన గొర్రెలు, మేకలు, గేదెలు వంటి వాటిని తాగునీరు ఉండేదని కాపరులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల శివారు బోర్ల ద్వారా నీటిని చిన్నపాటి కుంటలకు మరలించుకుని మూగజీవాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఆ బోర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని కాపరులు వాపోతున్నారు. కేవలం అధికారంకోసం, గ్రామంలో పట్టుకోసం బోర్లకు విద్యుత్ సరఫరా లేకుండా చేసి అటు ప్రజలను, ఇటు మూగజీవాలను ఇబ్బందులకు గురిచేయటం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లలో బోర్లు లేక, నూతన భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు నీరు అవసరమైతే ఇతర గ్రామాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఓ వర్గం చెప్పినట్లు బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


