గణనీయంగా పెరిగిన బాజీ బాబా దర్గా ఆదాయం | - | Sakshi
Sakshi News home page

గణనీయంగా పెరిగిన బాజీ బాబా దర్గా ఆదాయం

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

గణనీయంగా పెరిగిన బాజీ బాబా దర్గా ఆదాయం ముగిసిన భూ వరాహ జయంతి మహోత్సవాలు ఏపీ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సాతులూరు విద్యార్థిని రేపు కలెక్టరేట్‌లో ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ సమీక్ష

పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని బాజీ బాబా దర్గాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు దర్గా ఈఓ షేక్‌ ఖాజా మస్తాన్‌ తెలిపారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న హుండీల కానుకల లెక్కింపు మంగళవారం రాత్రి 11.30 గంటల వరకూ కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీల కానుకల లెక్కింపును నేరుగా వక్ఫ్‌బోర్డు అధికారులు తిలకించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు దర్గా ప్రాంగణంలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. దర్గాలో 17 నెలల కాలంగా ఉన్న ఏడు హుండీల కానుకల లెక్కింపులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్‌ షేక్‌ హైదర్‌బాషా, కస్మూర్‌ దర్గా ఈఓ షేక్‌ షరీఫ్‌, వక్ఫ్‌బోర్డు అకౌంట్స్‌ అధికారి సయ్యద్‌ ఆదంషఫీ, పెదకాకాని దర్గా ఈఓ షేక్‌ ఖాజామస్తాన్‌లు తెలిపారు. రెండు రోజులపాటు లెక్కించిన హుండీల ద్వారా ఎన్నడూ లేని విధంగా రూ. 39,64,440 ఆదాయం లభించిందన్నారు. 29 గ్రాముల బంగారం, 182 గ్రాముల వెండి లభ్యమైందన్నారు. ఎన్నడూ లేని విధంగా చిల్లర నాణేల రూపంలో రూ.5,60,800 కూడా బ్యాంక్‌లో జమ చేయడం జరుగుతుందన్నారు. బాబా వారి ఆదాయం పెరగడం పట్ల బుధవారం వక్ఫ్‌బోర్డు అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజుల నుంచి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న భూ వరాహ జయంతి మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి మంగళాశాసనాలతో ఈ నెల 24వ తేదీ నుంచి భూ వరాహ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తునామన్నారు. 26వ తేదీ ఉదయం భూ వరాహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.

నాదెండ్ల: ఆంధ్రప్రదేశ్‌ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సాతులూరు గ్రామానికి చెందిన గమ్మిడి రాగచౌదరి సత్తా చాటింది. విజయవాడలో మంగళవారం జరిగిన ఆక్షన్‌లో ఆల్‌రౌండర్‌ రాగచౌదరిని గోదావరి గోల్డెన్‌ జట్టు రూ.30 వేలకు దక్కించుకుంది. సెప్టెంబర్‌ 15న మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో బరిలో దిగనుంది. గ్రామానికి చెందిన గమ్మిడి శ్రీనివాస్‌, సీతామహాలక్ష్మి దంపతుల కుమార్తె, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మేనకోడలైన రాగచౌదరి చిన్నతనం నుంచే క్రికెట్‌లో రాణించింది. విజయవాడ వీజే కాలేజ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. 2023–24లో అండర్‌ 15, అండర్‌ 19 విభాగాల్లో ఏపీ తరపున నేషనల్స్‌ స్థాయిలో పాల్గొంది. 2025లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో రాణించింది. ఈ ఏడాది అండర్‌ 19 విభాగంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. రాయల్‌ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ ఎం. సురేంద్రబాబు వద్ద శిక్షణ పొందుతోంది.

నరసరావుపేట: కలెక్టరేట్‌లో ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌, ఐదుగురు సభ్యులు శుక్రవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారిత అధికారి దుర్గాభాయి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement