పచ్చ పాతం
ఆర్టీసీ కానిస్టేబుల్‌పై దాడి ఘటనపై నిర్లక్ష్యం
దర్జాగా తిరుగుతున్న మాజీ కార్పొరేటర్ అశోక్
కనీసం పట్టించుకోని పోలీసులు
స్వామి భక్తిని చాటుకుంటున్న పాత గుంటూరు పోలీసులు
పట్నంబజారు: అధికారం రెచ్చిపోతోంది. పోలీసుల అండతో దాడులకు తెగబడుతున్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులు నడిరోడ్డుపై కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. కూటమి సర్కార్.. తూర్పు ఎమ్మెల్యే విషయంలో పాతగుంటూరు పోలీసులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు.
దాడి జరిగిందిలా...
ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి గోడ కూల్చేందుకు టీడీపీ నాయకులు వెళ్లారు. అడ్డుకున్న ఆర్టీసీ కానిస్టేబుల్ ఆమంచి ఠాగూర్‌పై మాజీ కార్పొరేటర్ యల్లావుల అశోక్, మరో పది మంది గూండాలు వెంటపడి.. పరుగులు పెట్టించి దాడి చేశారు. దాడిపై ఉద్యోగి ఫిర్యాదు చేస్తే.. 22వ తేదీ రాత్రి వరకు కూడా పోలీసులు కనీసం కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు.
ఎందుకు పంచాయితీ!
ఆర్టీసీ కానిస్టేబుల్ ఠాగూర్ ఫిర్యాదు చేసిన తరువాత.. టీడీపీకి చెందిన కొంత మంది నేతలు నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి.. ఆర్టీసీ అధికారులతో పాటు, సదరు కానిస్టేబుల్‌ను కూడా పిలిపించి పంచాయితీ పెట్టారని తెలుస్తోంది. ఎస్‌హెచ్‌ఓ వెంకటప్రసాద్ సమక్షంలోనే ఈ పంచాయితీ జరిగింది. ఎట్టకేలకు రాత్రి కేసు నమోదు చేశారు.
రంగంలోకి కూటమి నేతలు..
ఘటన అనంతరం కూటమికి చెందిన కొందరు నేతలు ఆర్టీసీ అధికారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడైన మాజీ కార్పొరేటర్ యల్లావుల అశోక్.. పాత గుంటూరు పోలీసుస్టేషన్‌కు పది అడుగుల దూరంలోని తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్‌అహ్మద్ కార్యాలయంలో ఉన్నారని సమాచారం. కానీ అటు వైపు పోలీసులు తల ఎత్తి చూడలేని పరిస్థితి.
ఎమ్మెల్యే కార్యాలయం నుంచే పావులు..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యల్లావుల అశోక్, ఎమ్మెల్యే కార్యాలయం కేంద్రంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. సుమారు 20 మంది నిందితులు ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేసి, తిరిగి కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని చెప్పటంలో ఆంతర్యం.. అధికారమేనని ఇట్టే అర్థమవుతోంది. దర్జాగా స్టేషన్ ముందే నిందితుడు తిరుగుతున్నప్పటీకీ.. పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారని ఆ స్టేషన్ సిబ్బందే చెబుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్‌కు నిందితుడు సన్నిహితంగా ఉంటారనే భయంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సాహసం చేయటం లేదు.
అధికార పార్టీ నేతలు చెప్పినట్లే..
ఆర్టీసీ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో పోలీసులపై పూర్తిస్థాయిలో రాజకీయ పెత్తనం సాగుతోంది. దీనికి తగ్గట్లు స్టేషన్ అధికారికి, దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న యల్లావుల అశోక్‌కు సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. కనీసం ఇప్పటికీ నిందితుల కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని ఆ స్టేషన్ సిబ్బందే చెబుతున్నారు. నాన్ బెయిబుల్ కేసులు నమోదు చేశామని చెబుతున్నా.. అవన్నీ 41 నోటీసులు ఇచ్చి ప్రక్రియ సాగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. దాడిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.


