తెనాలిరూరల్: మండల పరిధిలోని కఠెవరం గ్రామంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. వివరాలను తెనాలి రూరల్ పోలీసులు వెల్లడించారు. గ్రామంలోని అయ్యప్పస్వామి గుడికి వెనుక ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్లాట్‌లోకి చొరబడి బెడ్ రూమ్ తలుపులు పగులగొట్టారు. బెడ్ రూమ్‌లో ఉన్న బీరువా పగులకొట్టి అందులో నుంచి రూ.ఐదు లక్షల నగదు, 85 గ్రాముల బంగారపు ఆభరణాలను దొంగలించారు. వెంకటలక్ష్మీకుమారి తన భర్తతో కలిసి ఈ నెల 12 రాత్రి హైదరాబాదులోని తన పిల్లల వద్దకు వెళ్లారు. చోరీ విషయం ఆదివారం ఉదయం అపార్ట్మెంట్ వాచ్‌మన్ యజమానులకు తెలియజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ నాయబ్ రసూల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెదకాకాని: శివాలయంలో అమ్మవారి ఆభరణాలు మాయం కేసు ముగింపునకు కొత్త పథకం రచించారా.. అంటే అవుననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పెదకాకాని శివాలయంలో ఈనెల 14వ తేదీ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూల అలంకారం పురస్కరించుకుని బంగారు ఆభరణాలు అలంకరించారు. 18వ తేదీ మంగళవారం రోజున అర్చకులు అమ్మవారికి అలంకరించిన మంగళసూత్రాలు, నాన్‌తాడు కనిపించడం లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు మరొక తప్పు అన్న చందంగా మారింది. ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండానే పోలీసులు దర్యాప్తు చేపట్టడం పరిస్థితి చేయిదాటి పోతుందనే సమయంలో ఈనెల 21వ తేదీన కేసు రిజిస్టర్ చేయడం పరిపాటిగా జరిగిపోయింది. ఈ వ్యవహారంపై ఆదినుంచి వైఎస్సార్ సీపీ అధికారుల తీరును ఎండగడుతూనే వచ్చింది.
గొలుసు దొరికిందా.. తయారు చేయిస్తున్నారా?
మాయమైన ఆభరణాలు వెతికే క్రమంలో ఆదివారం పలువురు పారిశుద్ధ్య కార్మికులచే ఆలయానికి సంబంధించిన చెత్త డంపింగ్ చేసే ప్రదేశంలో వెతికించారు. అక్కడ ఏమి దొరికిందనేది పక్కన పెడితే అసలు కట్టుకథ అక్కడే ప్రారంభమైందని స్థానికంగా చర్చనీయాంశమైంది. చెత్తలో వెతుకుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఒక గొలుసు దొరికింది. ఆ గొలుసు అచ్చం మాయమైన గొలుసులానే ఉంది. పరీక్ష పెట్టి చూస్తే అది రోల్‌గోల్డ్‌గా తేలింది. ఏది ఏమైనప్పటికీ ఆలయ అధికారి వద్దకు అర్చకులు చేరుకుని జరిగిందేదో జరిగిపోయింది, ఆలయ ప్రతిష్టను కాపాడే ప్రయత్నంలో భాగంగా మాయమైన అమ్మవారి ఆభరణాలను అర్చకులందరం కలిసి తయారు చేయిస్తాం. ఆలయ అధికారులకు అప్పగిస్తాం అనే పథకానికి వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శివాలయంలో తప్పు చేసిన వారు గానీ, తప్పుగా ప్రవర్తించిన వారు కానీ తప్పక స్వామి వారి ఆగ్రహానికి గురికాక తప్పదని స్థానికులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఆలయంలో పది రోజుల కిందట మాయమైన బంగారు ఆభరణాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధికారులు కొత్త పథకానికి రచిస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
లక్ష్మీపురం: తండ్రి మరణానంతరం కొడుకు ఆయన జ్ఞాపకంలో మద్యానికి బానిసై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటనపై ఆదివారం అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం దోర్నాల్ గ్రామానికి చెందిన దరివేముల సునీల్ కుమార్ (40) కారు డ్రైవరుగా పని చేస్తూ జీవిస్తునం సాగిస్తుంటాడు. 14 సంవత్సరాల కిందట అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరి ప్రేమించి వివాహం చేసుకోగా ఇరువురికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం డొంక రోడ్డు ఒకటో లైన్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొంత కాలం కిందట మృతుడి తండ్రి ప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి మృతుడు ప్రతిరోజూ తండ్రిని గుర్తు చేసుకుంటూ మద్యానికి బానిసగా మారాడు. ఆదివారం ఉదయం నుంచి అతిగా మద్యం సేవిస్తూ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో మూడు గంటల సమయంలో తలుపు కొట్టినా తీయకపోవడంతో తలుపు పగలగొట్టి చూడగా మృతుడు చీరతో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మల్లేశ్వరి అరండల్‌పేట పోలీసులకు సమాచారం తెలియజేసింది. పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


