సొంత డబ్బుతో చేసినట్లు బిల్డప్!
ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు
ఊరికి మళ్లింపు
భారీ సిమెంటు డ్రెయిను నిర్మాణం
పంచాయతీరాజ్ రోడ్డును పగులగొట్టి కల్వర్టులు
రేపటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సొంత డబ్బు
ఖర్చు పేరుతో బిల్డప్
ప్రజాసేవ ముసుగులో ఫ్యాక్టరీకి మేలు
రియల్టర్లయిన తెలుగు తమ్ముళ్లు పక్కాప్లాన్
అనుమతులు లేనిది నిజమే
తెనాలి: ఆ ఇద్దరూ తెలుగు తమ్ముళ్లు...ఒకరు స్థానిక మాజీ ప్రజాప్రతినిధి...మరొకరు సేవాసంస్థ బాధ్యుడు. ఇద్దరూ రియ ల్టర్లు. బాగానే ఆర్జిస్తున్నారు. ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. తమ స్వలాభం కోసం ప్రమాదకరమైన ఆటకు దిగారు. ప్రజాసేవ ముసుగులో ఓ కంపెనీ వ్యర్థజలాలను ఊళ్లోనుంచి దారిమళ్లింపునకు పూనుకున్నారు. భారీ సిమెంటు డ్రెయినును నిర్మించారు. అందులోంచి ఊళ్లోకి వచ్చిన వ్యర్దాలు, పంచాయతీ డ్రెయిన్లలోంచి ఊరవతల తుంగభద్ర డ్రెయినులో కలిసేలా ప్లాన్ చేశారు. ఊరు బయట ఫ్యాక్టరీ వ్యర్ధాలను ఊళ్లోంచి తీసుకెళుతూ గ్రామంలోని భూగర్భ జలాలను కలుషితం చేసే చర్యకు పాల్పడుతున్నారు. పలుకుబడి కలిగిన రియల్టర్లతో పెట్టుకోలేని గ్రామస్తులు మౌనంగా చూస్తున్నారు.
సబ్బుల ఫ్యాక్టరీ పక్షాన రంగంలోకి..!
తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురు ఇందుకు కార్యస్థానం. గ్రామం తూర్పు వైపున గల యడ్లపల్లి రోడ్డులో ఓ సబ్బుల ఫ్యాక్టరీ సుదీర్ఘకాలంగా నడుస్తోంది. తమిళనాడుకు చెందినవారు నడుపుతున్నారు. స్థానికులతో పెద్దగా సంబంధాల్లేవు. వ్యాపార విస్తరణకొద్దీ వ్యర్ధ జలాల నిర్వహణ సమస్యగా మారిందంటారు. యడ్లపల్లి రోడ్డు పక్కన పంటకాల్వలోకి వదులుతుంటే, దిగువన కొత్తగా వచ్చిన భవనాల యజమానులు అభ్యంతరం పెట్టారు. చుట్టూ పంటపొలాలు...మరో దారిలేదు. ఏం చేయాలా? అనే సమస్య ఫ్యాక్టరీ యాజమాన్యానికి. కాగలకార్యం సాధించేందుకు పైన చెప్పిన రియల్టర్లు రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీకి దక్షిణాన గల పంచాయతీరాజ్ రహదారి వెంట మీటరు వెడల్పు, మీటరు లోతు, మీటరు ఎత్తు సిమెంటు డ్రెయిను నిర్మించారు. పంట పొలాలకు, రోడ్డుకన్నా ఎత్తుగా నిర్మించిన ఈ డ్రెయినులోకి ఫ్యాక్టరీలోంచి వ్యర్ధజలాలు పోయేందుకు పంచాయతీరాజ్ రోడ్డును రెండుచోట్ల పగులగొట్టి మరీ కల్వర్టులు నిర్మిస్తున్నారు. కేవలం ఫ్యాక్టరీ వ్యర్థాలు, సమీపంలోని రియల్టర్లు నిర్మించిన అపార్టుమెంట్ల వాడుకనీరు పోయేందుకు మినహా ఆ డ్రెయినుతో ఇతరులకు ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు.
వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం
ఆ డ్రెయినులోంచి వచ్చే వ్యర్ధాలను పంచాయతీ మురుగుకాల్వల్లోంచి ఊరు బయటకు వెళ్లేందుకు, ఆ రియల్టర్లలో ఒకరు స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నపుడు పంచాయతీ నిధులతో పడమరవైపున ముందుగానే పక్కా డ్రెయినును నిర్మించారు. దీనితోపాటు కామన్‌రోడ్డులో గోడను నిర్మించారు. దీనిపై గ్రామస్తుల కోర్టును ఆశ్రయించి, కోర్టు ఆదేశాలతో పొక్లెయిన్‌తో పడగొట్టారు. ఇప్పుడు ఊరికి తూర్పువైపున నిర్మించిన డ్రెయినులోంచి ఊరుకు పడమరవైపున నిర్మించిన డ్రెయినులోకి వ్యర్థాలను పంచాయతీ డ్రెయిన్లలోంచి కలిపేలా ప్రణాళికను సిద్ధంచేశారు. భారీ సిమెంటు డ్రెయినును నిర్మించి, ఊళ్లో నుంచి తుంగభద్ర డ్రెయినులోకి మళ్లించే ప్రయత్నమిదని ఎవరికై నా అర్ధమవుతుంది. అరకిలో మీటరు పొడవునా నిర్మించిన భారీ డ్రెయినులోంచి ఊళ్లోకి వచ్చిన ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు, అడుగు వెడల్పు కూడా పంచాయతీ మురుగుకాల్వల్లోంచి ఊరవతలకు వెళ్లి తుంగభద్ర డ్రెయినులోకి చేరుకుంటాయి. తగినంత సామర్ధ్యంలేని పంచాయతీ కాల్వల్లోంచి ఫ్యాక్టరీ వ్యర్థాల సరఫరా అయితే పొంగిపొర్లుతాయి. రోడ్లు పాడవుతాయి. రసాయన వ్యర్‌ాధ్యలతో భూగర్భజలాలు కలుషితమవుతాయి. శాశ్వత సమస్య తలెత్తుతుందనేది వాస్తవం.
పంచాయతీరాజ్ రోడ్డును పగులగొట్టి కల్వర్టులు కడుతున్న విషయం తెలిసి వెళ్లాను. సబ్బుల ఫ్యాక్టరీ యజమాని చేయిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వం అనుమతులు లేకుండా రోడ్డును పగలగొట్టి, కల్వర్టుల నిర్మాణంపై ఫ్యాక్టరీ యజమానిని ప్రశ్నించాను. సీఎస్సార్ నిధులతో చేస్తున్నామని చెప్పారు. కల్వర్టుల నిర్మాణం తర్వాత రోడ్డు ఎలా ఉందో అలా అప్పగించాలని చెప్పాం.
– కిషోర్,
పంచాయతీరాజ్ ఏఈ, తెనాలి
రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సొంత డబ్బుతో నిర్మించినట్టు బిల్డప్ ఇస్తూ ఫ్యాక్టరీ కోసం పాటుపడుతున్నారు. పంచాయతి మురుగు కాల్వల్లో కలిసే ఫ్యాక్టరీ వ్యర్థాలతో గ్రామంలోని భూగర్భజలాలను కలుషితం చేసే చర్యకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఫ్యాక్టరీ యాజమాన్యం సమకూర్చిన డబ్బుతోనే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయేలా పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆ పదవిని చేపడితే పంచాయతీ నిధులతో ఆ పనులు చేసినట్టుగా బిల్లులు పెట్టి, మళ్లీ ఖర్చు చేసిన డబ్బును సొంతం చేసుకునే యోచనా ఉందంటున్నారు. ఆవిధంగా ప్రజాసేవ ముసుగులో అటు సొంతలాభంతోపాటు స్థానిక పదవికి గురిపెట్టారనే ఆరోపణలున్నాయి. పంచాయతీరాజ్ రోడ్డు పగులగొట్టి ఫ్యాక్టరీ కోసం కల్వర్టులు నిర్మించటం, పంచాయతీ కాల్వల్లోకి కలపటంపై సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులు విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు.


