దాడి ఘటన హేయం | - | Sakshi
Sakshi News home page

దాడి ఘటన హేయం

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

చీరాల: ఇసుక దందాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ డబ్బులు దండుకుంటున్న వారిపై కూటమి ప్రభుత్వం ఊదాసీనంగా వ్యవహరిస్తోందని చెప్పారు. చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కులపై మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన మాజీ విలేకరి నాయుడు నాగార్జునరెడ్డిపై ప్రత్యక్షంగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గపు చర్యగా చూడాలని అన్నారు. నాగార్జునరెడ్డిపై జరిగిన దాడి వెనుక కూటమి ఎమ్మెల్యే కుమారుడు ప్రోద్బలం ఉన్నట్లు బాధితుని భార్య మీడియా ముందు వాపోవడం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చనన్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టిసారించి కూటమి పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు.

వినతిపత్రాలు అందజేసి వైద్యుల నిరసన

గుంటూరు మెడికల్‌: ప్రభుత్వం నుంచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన యూజీసీ–2016 జీతం బకాయిలు ఇవ్వడం కుదరదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తాఖీదు ఇచ్చినందుకు నిరసనగా బుధవారం గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఏపీ నేతలు (జీడీఏ ఏపీ) గుంటూరు వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇచ్చిన తాఖీదుకు నిరసనగా మూకుమ్మడిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు యూనియన్‌ నేతలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌, నేతలు డాక్టర్‌ మారుతీ దేవి, డాక్టర్‌ అజయ్‌, డాక్టర్‌ రాజా, డాక్టర్‌ సుధా రాణి, డాక్టర్‌ రవీంద్ర, డాక్టర్‌ శివ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

రహదారుల పనులు వేగవంతం కావాలి

తాడికొండ: రాజధానిలో రహదారుల పనులు వేగంగా పూర్తిచేసి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.లక్ష్మీ పార్ధసారధి అధికారులను ఆదేశించారు. బుధవారం బీఎస్‌పీఎల్‌ సంస్థ చేపడుతున్న ఎన్‌–3 ఎన్‌–4, ఎన్‌–16, ఎన్‌–17 రహదార్ల నిర్మాణాలను పరిశీలించారు. రహదారులు –ముఖ్యమైన మౌలిక వసతుల పనులు మరింత వేగంగా జరగాలన్నారు. ప్రధానంగా భూ సేకరణ ద్వారా ఏపీ సీఆర్డీఏ నుంచి పరిష్కారమైన భూముల్లో నిలిచిపోయిన రహదారుల నిర్మాణాలను సదరు కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించిగా వాటి నిర్మాణ పురోగతిని ఏడీసీ చీఫ్‌ ఇంజినీరు బి.నరసింహ మూర్తి నివేదించారు. ముఖ్యంగా ‘ఈ’ రోడ్లు, ‘ఎన్‌’ రోడ్లు క్రాస్‌ అవుతున్న ప్రదేశాలలో జంక్షన్ల వద్ద నిర్మాణ పనులపై ఇంజినీరింగ్‌ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఏడీసీ సూపరింటెండింగ్‌ ఇంజినీరు రమేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఎస్‌.శ్రీధర్‌, గ్రీనరీ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement