చేబ్రోలు: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (ఎన్‌టీటీఎం)కు చెందిన అధికారుల బృందం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీని మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఎన్‌టీటీఎం ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ప్రయోగశాల, మౌలిక వసతులను అధికారులు పరిశీలించడంతో పాటు విద్యార్థులు, టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమైనట్లు వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భాస్కర్ కల్రా నాయకత్వం వహించారు. ఆయనతో పాటు ఎన్‌టీటీఎం సెక్షన్ ఆఫీసర్ శుభం నర్వాల్, సీనియర్ అసోసియేట్ అరుషి సేథి పాల్గొన్నారు. ఎన్‌టీటీఎం సహకారంతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (ఎఫ్‌ఈఎస్‌ఈఎం) సదుపాయాన్ని ప్రారంభించారు. సుమారు 200 మంది విద్యార్థులతో స్టూడెంట్ ఔట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 40 మంది పరిశ్రమ ప్రతినిధులతో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయ పథకాలను మరింత విస్తృతంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలిరూరల్: డబ్బు కోసం యాచకుడిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పట్టణ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యాచకుడు కుంచాల వెంకటనారాయణ(70) అనే వృద్ధుడు 2025 జూన్ 8న రాత్రి మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, హత్య కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్‌ను అరెస్టు చేశారు. వృద్ధుడు యాచించగా వచ్చిన డబ్బును దగ్గర ఉంచుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించాడు. అతని వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గమనించిన రాజేష్ నిద్రపోతున్న వెంకటనారాయణ పై దాడి చేసి హతమార్చి నగదును అపహరించి పరారయ్యాడు. పైగా వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. నిందితుడు మృతుడి నుంచి అపహరించిన రూ. మూడు వేలలో రూ.300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి, అప్పటి త్రీ టౌన్ సీఐ ఎస్.రమేష్‌బాబు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు మంగళవారం విచారణకు రావడంతో సాక్షాధారాలను పరిశీలించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు నిందితుడికి బీఎన్‌ఎస్ సెక్షన్ 101(1) కింద జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా, , బీఎన్‌ఎస్ సెక్షన్ 309(4) కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా, బీఎన్‌ఎస్ సెక్షన్ 238 కింద ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎంవీ సాంబశివరావు వాదించారు.


