గుంటూరు నగరపాలక సంస్థలో రూ.68.65 లక్షల కుంభకోణం 2015–17 మధ్య కాలంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం క్రిమినల్ కేసులు నమోదు చేసి నష్టాన్ని రికవరీ చేయాలన్న లోకాయుక్త రూ.34.20 లక్షలు మాత్రమే రికవరీ చేసి వదిలేసిన వైనం లోకాయుక్త ఆదేశాలు బేఖాతరు.. దోచుకున్న వారికే మళ్లీ అందలం బదిలీల్లో అవినీతి తిమింగలాలకే కీలక పోస్టింగులు
గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)లో ‘దొంగల చేతికే తాళాలు’ ఇచ్చేశారు. ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచేసిన అధికారులను అందలం ఎక్కిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో నకిలీ చలానాలు సృష్టించి కార్పొరేషన్ ఖజానాకు కన్నం వేసిన దొంగలపై కేసులు నమోదు చేసి నొక్కేసిన సొమ్మును వారి నుంచి స్వాధీనం చేసుకోవాల్సిందిపోయి, వారిపై కనీస చర్యలు కూడా తీసుకోకుండా వదిలేశారు.
ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి కీలక పోస్టులు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన సూపరింటెండెంట్ల బదిలీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే కీలక పోస్టింగులు దక్కాయి. ప్రస్తుత కమిషనర్ చర్యలు తీసుకోవాలని రాసిన వారిలో ఎస్.ఎన్. ప్రసాద్: కమిషనర్ ఛాంబర్‌లో సీసీగా కొనసాగుతూ.. గతంలో అకౌంటెంట్–1, తాజాగా అకౌంటెంట్–2 పోస్టును కూడా దక్కించుకున్నారు. ఎస్.వి.వి.ఎస్. మదన్ గోపాల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో), ఎండీ సాధిక్ పాషా రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో), ఎస్.కె. బాలాజీ బాషా మేనేజర్‌గా కొనసాగుతున్నారు. డి. మాధవి ప్రస్తుతం కార్యాలయంలో విధుల్లో కొనసాగుతున్నారు. మిగిలిన వారిలో టి. ఉమా మహేశ్వరరావు మరణించగా, ఎస్. లక్ష్మి, ఎ. చిరంజీవి, ఎం.వి. సుబ్రహ్మణ్యం రిటైర్ అయ్యారు) ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి శాఖాపరమైన శిక్షలు వేయాల్సింది పోయి, తిరిగి అకౌంట్స్, రెవెన్యూ విభాగాల్లోనే అందలం ఎక్కించడంపై నగర ప్రజలు, ప్రజాసంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు వీరిని కీలక పోస్టుల నుంచి తప్పించి లూప్‌లైన్‌లో వేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. కమిషనర్ మయూర్ అశోక్‌ను దీనిపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రజలు కార్పొరేషన్‌కు చెల్లించిన డబ్బును బ్యాంకుల్లో జమ చేయకుండా నకిలీ బ్యాంకు రబ్బర్ స్టాంపులు తయారు చేసి, ఆ డబ్బును బ్యాంకుల్లో జమ చేసినట్లుగా నకిలీ చలానాలు సృష్టించి రూ.68.65 లక్షలు కాజేసిన దొంగలకు అధికారులు, ప్రభుత్వం వత్తాసు పలుకుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ అని తేల్చేది వీళ్లే.. వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేసేది వీళ్లే.. అని జీఎంసీ అధికారులు, సిబ్బంది విస్తుపోతున్నారు. ఇదేమీ గోప్యంగా జరిగింది కాదు. ఏకంగా ప్రభుత్వమే వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రెండేళ్లుగా వారిపై చర్యలు తీసుకునేందుకు జీఎంసీ అధికారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. నకిలీ చలానాల వ్యవహారంలో పాత్రధారులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గత నెల 24న జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు, సొమ్మును దోచేసిన దొంగలకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటం వల్లే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వారిని ‘కీ’ పోస్టుల్లో ఉంచి దోచుకోమన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
రూ.68.65 లక్షల దోపిడీ ఇలా..
2015 నుంచి 2017 మధ్య టౌన్ ప్లానింగ్ విభాగంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో నకిలీ బ్యాంకు చలానాలు, స్టాంపులు సృష్టించి మొత్తం రూ.74.79 లక్షలు కార్పొరేషన్‌కు జమ కావాల్సి ఉండగా, అందులో ఏకంగా రూ.68.65 లక్షలు ఉద్యోగులే స్వాహా చేశారు. ఇందులో ఇటీవల రూ.34.20 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.34.45 లక్షలు రికవరీ కావాల్సి ఉంది. ఇంత ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినప్పటికీ అటు అధికారులకు గానీ, ఇటు ప్రభుత్వానికి గానీ చీమకుట్టినట్లయినా లేదు. సొమ్మును కాజేసిన వారి నుంచి వడ్డీ సహా మొత్తం రికవరీ చేయాల్సిన అధికారులు, అసల్లో సగం మాత్రం వసూలు చేసి, మిగతాది వదిలేశారంటే ప్రజాధనం అంటే వీరికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.
లోకాయుక్త ఆదేశాలకూ దిక్కులేదు
ఈ భారీ కుంభకోణానికి బాధ్యులైన 8 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దోచుకున్న సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని 2024 డిసెంబర్‌లో లోకాయుక్త స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఓ ఉద్యోగి అప్పటి కమిషనర్ పులి శ్రీనివాసులు అండదండలతో ఫైల్‌ను తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గతేడాది జూలై 24న ప్రభుత్వానికి లేఖ రాసినా, క్షేత్రస్థాయిలో మాత్రం వీరికి రాజ భోగాలు కొనసాగుతున్నాయి.


