20 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం మార్చుకునేందుకు 24న తుది అవకాశం 31న సీట్ల కేటాయింపునకు ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానంలో చేపట్టిన ప్రక్రియలో భాగంగా కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 20వ తేదీ నుంచి మొదలుకానుంది. మొదటి విడతలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే వివిధ కళాశాలలకు ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకునేందుకు ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు చివరి అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమల్లో భాగంగా డిగ్రీ కోర్సులను సమూల మార్పులతో తీర్చిదిద్దిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. విద్యార్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేస్తున్నారు. తదుపరి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
గత ప్రభుత్వ సంస్కరణల బాటలో..
విద్యారంగంలో సమూలమైన మార్పులను తెచ్చిన గత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ గత రెండేళ్లుగా ఇదే విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, బాపట్లలోని మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లలోని కో ఎడ్యుకేషన్ కళాశాలలతో పాటు 70 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఈనెల 31న సీట్ల కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 2వ తేదీలోపు అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంది. డిగ్రీలో ప్రవేశాలకు ఉద్దేశించిన పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీఎస్.సీఏపీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్‌లో పొందుపర్చిన నోటిఫికేషన్‌ను సందర్శించాలి.


