తాడికొండ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర వీవీఐపీలు, వీఐపీల భద్రతతో పాటు శాసనసభ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గుంటూరు జిల్లా పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాసనసభ పరిసర ప్రాంతాలను పరిశీలించి, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీకి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, వాహన తనిఖీ కేంద్రాలు, ప్రవేశ ద్వారాలు, వీఐపీ,వీవీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. భద్రతా పర్యవేక్షణలో డ్రోన్ నిఘా, సీసీ కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అసెంబ్లీ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాల మధ్య త్వరిత సమాచార మార్పిడి, సమన్వయం, సమర్థ స్పందన ఉండేలా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ప్రతి షిఫ్ట్‌లో విధుల బాధ్యతలను తదుపరి సిబ్బందికి స్పష్టంగా అప్పగించాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అధికారులు రవికుమార్, అలహరి శ్రీనివాస్, సుంకరయ్య, మల్లికార్జునరావు, కె.శ్రీనివాసరావు, కృష్ణయ్య, శ్రీహరి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


