మేయర్‌ పదవికి మళ్లీ ‘ప్రత్యక్ష’ పోరు! | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పదవికి మళ్లీ ‘ప్రత్యక్ష’ పోరు!

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

● క్యాబినెట్‌ ఆమోదంతో నగరపాలక సంస్థ ఎన్నికలకు నిర్ణయం ● అక్టోబర్‌లోగా నిర్వహణ దిశగా టీడీపీ ప్రభుత్వం కసరత్తు

నెహ్రూనగర్‌: నగరపాలక సంస్థల్లో మేయర్‌ ఎన్నికను తిరిగి ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో గుంటూరు కార్పొరేషన్‌లో రాజకీయ చర్చ ఊపందుకుంది. గత చరిత్ర, నాటి ఎన్నికల విధానాలు, మారిన రాజకీయ సమీకరణాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

అప్పట్లో రెండు ఓట్లు.. ప్రత్యక్ష ఎన్నికలు

1994లో గుంటూరు పురపాలక సంఘం కాస్తా నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ అయింది. 1995లో తొలి సారి కార్పొరేషన్‌ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ తరఫున డాక్టర్‌ కొల్లి శారద ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌గా ఎన్నికయ్యారు. నగర ప్రజలు ఒక ఓటు మేయర్‌ అభ్యర్థికి, మరొక ఓటు కార్పొరేటర్‌ అభ్యర్థికి వేశారు. అనంతరం 2000 సంవత్సరంలోనూ ఇదే విధానం కొనసాగగా, టీడీపీ అభ్యర్థి చుక్కా ఏసురత్నం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మేయర్‌గా గెలుపొందారు.

2005లో విధాన మార్పు

2005లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష పద్ధతిని రద్దు చేసి, గెలిచిన కార్పొరేటర్లే మేయర్‌ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ క్రమంలో కన్నా నాగరాజు (2005–08), ఆ తర్వాత రాయపాటి మోహన సాయికృష్ణ (2008– 10) మేయర్లుగా వ్యవహరించారు. అయితే 2010లో పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఏకంగా 11 ఏళ్లపాటు స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కాలయాపన చేశాయి.

2021లో వైఎస్‌ జగన్‌ చొరవ

దశాబ్దానికి పైగా ఎన్నికలు లేక స్థానిక స్వపరిపాలన కుంటుపడిన వేళ, వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021 మార్చిలో కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 57 డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ ఏకంగా 44 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ప్రకటించడంతో పార్టీ బలం 46కు చేరింది. టీడీపీ 9, జనసేన 2 స్థానాలకే పరిమితమయ్యాయి.

ప్రలోభాలు, కొనుగోళ్లు..

గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి రావడంతో గుంటూరు కార్పొరేషన్‌లో ప్రలోభాల పర్వం మొదలైంది. కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని 2025 ఏప్రిల్‌లో టీడీపీ కార్పొరేటర్‌ కోవెలమూడి రవీంద్రను మేయర్‌గా కూటమి కూర్చోబెట్టింది. అనంతరం మార్చి 17తో పాలకవర్గం గడువు ముగియడంతో, తర్వాత ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. ప్రస్తుతం అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ప్రభుత్వం మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానానికి తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement